తెలంగాణ బిల్లుపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ | tense situation over telangana bill in all parties | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లుపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ

Published Fri, Nov 29 2013 1:07 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

tense situation over telangana bill in all parties

కాంగ్రెస్, కేంద్రం, జీవోఎం తీరుపై ప్రజల్లో ఆందోళన
‘రాయల’పై, హైదరాబాద్‌పై రోజుకో రకం లీకులు
మరోవైపు ముంచుకొస్తున్న పార్లమెంట్ సమావేశాలు
డిసెంబర్ రెండో వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు!
అవి సోనియా జన్మదినమైన డిసెంబర్ 9నే ఉంటాయా?
పార్లమెంటులో బిల్లు పెట్టి ఊరుకుంటారా, పొడిగించి ఆమోదిస్తారా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం బిల్లుపై ఉంటుందా?
‘ఉమ్మడి’ చిక్కుముడిపై ఎలాంటి పరిష్కారాలు చూపుతారు?
 
సాక్షి, హైదరాబాద్

రాష్ట్ర విభజన అంశానికి చివరికి ఎలాంటి ముగింపు ఉంటుంది? విభజన ప్రక్రియపై కొద్దిరోజులుగా కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) చేస్తున్న హడావుడి, ఇంతకాలంగా గందరగోళమయంగా సాగిన చర్యల మధ్య నలుగుతూ వచ్చిన ఈ వ్యవహారం చివరి అంకంలో ఏ రకమైన మలుపులు తిరగనుంది? ఇప్పుడు సర్వత్రా వీటిపైనే చర్చ సాగుతోంది. ప్రధానంగా రానున్న కొద్ది రోజుల్లో ఏం జరగబోతోంది? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? విభజన బిల్లు రాష్ట్ర శాసనసభకు ఎప్పుడు వస్తుంది? అసలు ఈ మొత్తం వ్యవహారానికి ఎలా తెర దించుతారు? వంటి ప్రశ్నలు అందరికీ ఉత్కంఠ కలిగిస్తున్నాయి. డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చర్చలన్నీ విభజన చుట్టే సాగుతున్నాయి. అయితే డిసెంబర్ 17 లోపే తెలంగాణ బిల్లు పార్లమెంటుకు చేరేలా పావులు కదుపుతున్నారంటూ వస్తున్న వార్తలు కూడా మరింత అయోమయానికి, మరిన్ని అనుమానాలకే తావిస్తున్నాయి. అందులోని సాధ్యాసాధ్యాలపై కూడా అన్ని వర్గాల్లోనూ సందేహాలే తలెత్తుతున్నాయి. ఇవి చాలవన్నట్టు హైదరాబాద్ హోదాపై, రాయల తెలంగాణపై రోజుకో రకంగా వస్తున్న ఊహాగానాలు రాష్ట్ర ప్రజలను మరింతగా ఆందోళనలోకి నెడుతున్నాయి. జీహెచ్‌ఎంసీనే ఉమ్మడి రాజధాని చేస్తారని, కాదు హెచ్‌ఎండీఏ పరిధి మొత్తాన్నీ అని, రాయల తెలంగాణే ఇస్తారని, ఇవ్వబోరని... ఇలా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు, కేంద్ర ప్రభుత్వం, జీవోఎం సభ్యులే రకరకాల లీకులిస్తూ గందరగోళాన్ని యథాశక్తి పెంచుతున్నారు.
 
 మళ్లీ తెరపైకి ‘డిసెంబర్ 9’
 విభజన బిల్లు ముసాయిదాపై జీవోఎం కసరత్తు పూర్తి చేసింది. కేంద్ర న్యాయ శాఖ రూపొందించే ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు’ త్వరలోనే కేంద్ర కేబినెట్‌కు రానుంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు, అంటే డిసెంబర్ 4న కేంద్ర మంత్రివర్గం సమావేశమై బిల్లును ఆమోదిస్తుందని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ఆ తర్వాత జరగబోయే పరిణామాలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. పార్లమెంట్ ప్రారంభమయ్యే తొలి రోజునే, అంటే డిసెంబర్ 5న బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆయన వెనువెంటనే రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోరతారా, లేదా కొంత సమయం తీసుకుంటారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బిల్లును ఆయన ఓ మూడు రోజుల పాటు పరిశీలించాక అసెంబ్లీకి పంపుతారనుకున్నా, డిసెంబర్ రెండో వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశం ఉండేలా కన్పిస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ 9 నుంచి 11 మధ్య అసెంబ్లీ సమావేశం కావచ్చు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు జరిగే సమావేశాలైనందున కేవలం విభజన బిల్లుపై అభిప్రాయం తెలిపేందుకు మాత్రమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం కావడం, 2009లో కూడా డిసెంబర్ 9వ తేదీనే కేంద్ర మంత్రి చిదంబరం తొలిసారి తెలంగాణ ప్రకటన చేయడం తెలిసిందే. ఈ దృష్ట్యా ఈసారి కూడా డిసెంబర్ 9నే అసెంబ్లీని సమావేశపరిచే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అలా చేస్తే సొంత పార్టీ నుంచే సోనియాపై  విమర్శలు తప్పవని, కాబట్టి ఆ రోజు అసెంబ్లీ సమావేశం ఉండకపోవచ్చని కూడా వాదన వినిపిస్తోంది. పైగా ప్రత్యేక సమావేశాలను ఒక్క రోజుతోనే ముగిస్తారా?, లేక సుదీర్ఘ చర్చకు ఆస్కారమిచ్చి రెండు రోజులు కొనసాగిస్తారా? అన్నది రాష్ట్రపతి ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడిదాకా ఒకవేళ అంతా సాఫీగా సాగినా పార్లమెంట్‌లో బిల్లు ఎప్పుడు ప్రవేశపెడుతారు, దానిపై చర్చకు ఉండే సమయమెంత? వంటివి కూడా ఆసక్తికరంగా మారాయి.
 
 బిల్లు పెట్టబోరంటున్న అధికారులు
 అధికార వర్గాలు మాత్రం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అసలు తెలంగాణ బిల్లు పెట్టే అవకాశాలే లేవని చెబుతున్నాయి! డిసెంబర్ 5న సమావేశాలు మొదలై 20వ తేదీ దాకా జరుగుతాయి. మధ్యలో 7, 8, 14, 15 సెలవు దినాలు.అంటే 12 రోజులే జరిగే సమావేశాల్లో విభజన బిల్లుకు ఆమోదముద్ర పడటం ఏ మాత్రం సాధ్యం కాదని ఆ వర్గాలంటున్నాయి. రాజకీయ వర్గాలు మాత్రం అసెంబ్లీ అభిప్రాయం అనంతరం రాష్ట్రపతి నుంచి వచ్చే బిల్లును డిసెంబర్ మూడో వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. ఆ లెక్కన బిల్లును డిసెంబర్ 16న పార్లమెంట్‌లో ప్రవేశపెడతారనుకున్నా దానిపై లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఇదంతా కేవలం నాలుగు రోజుల్లో పూర్తి కావాలి! ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ ఏర్పాటు ప్రక్రియకు దాదాపు 2 సంవత్సరాలు పట్టడాన్ని ఈ సందర్భంగా కొన్ని వర్గాలు ఉదహరిస్తున్నాయి. కానీ ఇప్పుడు మిగిలింది కేవలంబిల్లుకు ఆమోదముద్ర వేయడం మాత్రమేనని, పైగా అందుకు పార్లమెంటులో సాధారణ మెజారిటీ చాలు గనుక ఈ సమావేశాల్లోనే విభజన ప్రక్రియంతా పూర్తయ్యే ఆస్కారం లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
 
 4 నెలలుగా గందరగోళమే
 విభజనపై కాంగ్రెస్ ఆది నుంచీ ప్రతి అడుగూ రాజకీయ వ్యూహంలో భాగంగానే వేస్తోంది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తామని సీడబ్ల్యూసీలో తీర్మానం చేసినా జూలై 30 నుంచి ఈ నాలుగు నెలలుగా నలభై రకాల డ్రామాలు నడిపింది! రాయల తెలంగాణ అని, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమనీ, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలుపుతామని.. ప్రతి సందర్భంలోనూ ఆయా అంశాలపై లీకులతో గందరగోళపరుస్తూ వచ్చింది. సీమాంధ్రలో వెల్లువెత్తిన ఉద్యమాన్ని చల్లార్చడానికా అన్నట్టు రోజుకో రకం కథ తెరపైకి తెచ్చి అయోమయ పరిస్థితులను సృష్టించింది. హడావుడిగా పార్టీపరంగా ఆంటోనీ కమిటీ వేసి, మళ్లీ పార్టీల అభిప్రాయమనీ, జీవోఎం ఏర్పాటు చేసి, దానికి వచ్చిన ప్రతిపాదనపై చర్చలంటూ అందరినీ అయోమయంలో పడేసింది. ఇదంతా ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎదుర్కొనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చేసినట్టు చెబుతున్నారు. ఇంతా చేసి, నాలుగు నెలల ‘కసరత్తు’ తర్వాత కూడా ఇప్పటికీ బిల్లుకు తుది మెరుగుల ప్రక్రియే సాగుతోందంటూ మళ్లీ లీకులే ఇస్తోంది! మొత్తానికి విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినా, లేదా దానికి ఏదో ఒక దశలో బ్రేక్ పడినా రాజకీయంగా తనకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడకుండా ఉండేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఇలా నానాపాట్లూ పడుతోందన్న విమర్శలున్నాయి.
 
 డిసెంబర్ 8 తర్వాత పరిస్థితిలో మార్పు?
 ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా విభజన బిల్లుపై ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల్లో మిజోరం మినహా మిగతా రాష్ట్రాల ఫలితాలన్నీ కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటిని లోక్‌సభ సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా అవి భావిస్తున్నాయి. డిసెంబర్ 8న వాటి ఫలితాలు వెలువడనున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు’కు కాంగ్రెస్, బీజేపీ మద్దతిస్తున్నప్పటికీ సీమాంధ్ర సమస్యలపై బీజేపీ లేవనె త్తే అంశాలకు బిల్లులో పరిష్కార మార్గాలు లేకపోతే అప్పుడు ఆ పార్టీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తుంది? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ ఊపు బీజేపీ తీరులో ఎలాంటి మార్పు తేవచ్చు? విభజన బిల్లుపై ఎలాంటి చర్చకు అది పట్టుబట్టవచ్చు? ఇలాంటి అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. బీజేపీ మద్దతు లేకుండానే బిల్లు ఆమోదం పొందడానికి కూడా కాంగ్రెస్ నాయకత్వం అంతర్గతంగా ‘ఫ్లోర్ మేనేజ్‌మెంట్’ చేసిందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ అంచనాలన్నీ ఒకవిధంగా ఉండగా, మరోవైపు అసెంబ్లీల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా వస్తే యూపీఏ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకం కావడమే గాక అవిశ్వాస తీర్మానం, ముందస్తు ఎన్నికల వంటివెన్నో తెరపైకి రావచ్చంటున్నారు. ఒకవిధంగా అసెంబ్లీల ఫలితాలు వెల్లడయ్యే డిసెంబర్ 8, మర్నాడే వచ్చే సోనియా జన్మదినమైన డిసెంబర్ 9ల్లో జరిగే పరిణామాలపైనే బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement