జిల్లాలో 52,296 మంది విద్యార్థులు
బాలురు 26,369 - బాలికలు 25,927
మార్చి 26 నుంచి ఏప్రిల్ 11వరకు పరీక్షలు
86 సిట్టింగ్ స్క్వాడ్లు, 144 సెక్షన్ అమలు
250 పరీక్షా కేంద్రాలు, 55 స్టోరేజీ సెంటర్లు
ఏలూరు సిటీ :పాఠశాల విద్యలో విద్యార్థి భవితకు మలుపుగా భావించే పదోతరగతి పరీక్షలకు ఒకవైపు విద్యాధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తుండగా, మరోవైపు విద్యార్థులు పరీక్షల్లో తమ సత్తా చాటుకునేందుకు సీరియస్‌గా స్టడీ చేస్తున్నారు. ఇక పదోతరగతి పబ్లిక్ పరీక్షలను పక్కాగా, పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు చెప్పారు. మంగళవారం ఏలూరులోని డీఈవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పరీక్షల నిర్వహణ వివరాలు వెల్లడించారు. ఈ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మార్చి 26నుంచి ఏప్రిల్ 11వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని, జిల్లాలో 52,296 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు.
పక్కా ఏర్పాట్లు చేశాం
టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు డీఈఓ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించామని, సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూయించివేస్తామని తెలిపారు. మరుగుదొడ్లు ఏర్పాటుతోపాటు ప్రతి గది వద్ద మట్టికుండతో తాగునీరు సౌకర్యం, ప్రథమ చికిత్సా శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా చర్యలు చేపట్టాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. విద్యార్థులు పరీక్షలకు సకాలంలో చేరేలా ఆర్టీసీ బస్ సర్వీసులను ఎక్కువగా ఏర్పాటు చేశారు
250 పరీక్షా కేంద్రాలు
జిల్లాలో పది పరీక్షలు రాసే విద్యార్థులు 52, 296మంది హాజరవుతారు. దీనిలో బాలురు 26, 369మంది, బాలికలు 25, 927మంది పరీక్షలు రాస్తారు. రెగ్యులర్ విద్యార్థులు 48664మందిలో బాలురు 23996మంది, బాలికలు 24668మంది ఉండగా, ప్రైవేటు విద్యార్థులు 3632మందిలో బాలురు 2373మంది, 1259మంది బాలికలు ఉన్నారు. జిల్లాలో 250 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది అదనంగా మొగల్తూరు మండలం తూర్పుకాలనీ, కొవ్వూరు మండలం దుద్దుకూరు, చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 235పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఉండగా, 15కేంద్రాలకు సమీప పాఠశాలల నుంచి డెస్క్‌లు తీసుకువచ్చి ఏర్పాటు చేస్తారు. ఆరు సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు, వాటిలో జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, చింతలపూడి, తూర్పుతాళ్ళ, దుద్దుకూరు, యర్రగుంటపల్లి ఉన్నాయి. ప్రశ్నాపత్రాలను 55స్టోరేజీ పాయింట్లలో భద్రపరిచారు. ప్రశ్నాపత్రాల పంపిణీ, భద్రతకు 110మంది కస్టోడియన్లను నియమించారు. పరీక్షల్లో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఈసారి ఏకంగా 86సిట్టింగ్ స్వ్కాడ్లు ఏర్పాటు చేశారు. 250మంది చీఫ్ సూపరింటిండెంట్లు, 250మంది డిపార్టుమెంటల్ అధికారులు, 16మంది అసిస్టెంట్ డిపార్టుమెంటల్ అధికారులను నియమించారు.
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు
Published Wed, Mar 18 2015 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM
Advertisement
Advertisement