పదో తరగతి టెన్షన్
Published Tue, Jan 7 2014 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: పదో తరగతి విద్యార్థుల్లో కలవరం మొదలైంది. ఓ వైపు సిలబస్ పూర్తి కాకపోవడం, మరోవైపు పరీక్షలు దగ్గరపడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది దాదాపు యాభై రోజుల పాటు సమ్మెలు, ధర్నాల వల్ల విద్యార్థులు తరగతులు నష్టపోయారు. ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు ఎంతగా ప్రయత్నించినా సిలబస్‌ను మాత్రం పూర్తి చేయలేకపోయారు. ఉపాధ్యాయులకు నిర్వహించిన సమావేశాలు కూడా సిలబస్ పూర్తి కాకపోవడానికి కారణమయ్యాయి. అలాగే విద్యా వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో టీచర్ల కొరత ప్రభావం బోధనపై పడింది. వీరి స్థానంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తామని చెప్పినా... విద్యా సంవత్సరం మొదలై ఆరునెలలు గడిచిన తర్వాత ఆ ప్రక్రియ మొదలై అరకొరగానే జరిగింది. ఇటీవల 73 మందిని భర్తీ చేసినప్పటికీ ఇంకా సబ్జెక్టు టీచర్లు లేని ఉన్నత పాఠశాలలు 25 వరకు ఉన్నట్లు సమాచారం.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. అయితే సిలబస్‌లు పూర్తి కాకపోవడంతో పరీక్షలకు హాజరు కానున్న దాదాపు 30వేల మంది విద్యార్థులు ఏం చేయాలో తెలీని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే త్రైమాసిక పరీక్షలను వాయిదా వేసి డిసెంబర్‌లో నిర్వహించారు. అర్ధ సంవత్సర పరీక్షలు కూడా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో విద్యార్థులు పాఠ్యాంశాలను ఏ మాత్రం అవగాహన చేసుకున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సిలబస్ కూడా మారడం కొత్త చిక్కులు తెచ్చింది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా అది విద్యార్థులకు అదనపు శ్రమ ఇవ్వడం మినహా ఎలాంటి ఉపయోగం ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సెలవు దినాలే ఎక్కువ...
విద్యా సంవత్సరంలో మొత్తంలో 220 పని దినాలుండగా పురుష ఉపాధ్యాయులకు 15 సాధారణ, 7 ప్రత్యేక సెలవులుంటాయి. అదే మహిళలకైతే వీటితోపాటు అదనంగా ఐదు సెలవులు ఉన్నాయి. వివిధ పండగలు, శిక్షణల పేరుతో విద్యాసంవత్సరంలో 150 రోజులు మాత్రమే తరగతులు జరుగుతాయి. ప్రత్యేక శిక్షణలని అంటున్నా... ప్రైవేటు విద్యాసంస్థలతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గుతూనే ఉంది.
సబ్జెక్టు టీచర్ల కొరత
జిల్లాలో అప్‌గ్రేడ్ అయిన స్కూళ్లు కాకుండా 330 వరకూ ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి. వీటిలో మొన్నటి వరకు సుమారు 250 మంది టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండేవి. జిల్లా విద్యాశాఖ పదోన్నతులు కల్పించడం, సర్దుబాటు వంటి చర్యలు తీసున్నా ఇంకా 30 శాతం కొరత ఉంది. సర్దుబాటు ముసుగులో అవసరమైన చోటుకు కాకుండా అనవసరమైన చోటుకు కొందరు పైరవీలు చేయించుకుని బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రత్యేక చర్యలు తీసుకుంటాం:
డీఈఓ కృష్ణారావు
సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా కోల్పోయిన 50 రోజుల కాలాన్ని సరిచేసుకునే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ జి.కృష్ణారావు ‘న్యూస్‌లైన్’కి తెలిపారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహించి సరిచేస్తున్నామన్నారు. సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చడానికి సర్దుబాటు చర్యలు తీసుకున్నామని అన్నారు.
Advertisement