
పసుపు రంగులో ఇచ్చిన ప్రశ్నపత్రం
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుంది అధికారుల తీరు.. చివరికి పదో తరగతి పరీక్షలను కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నట్టు ఉంది. జనరల్ విద్యార్థులకు సాధారణ తెలుపు రంగు ప్రశ్నాపత్రాలను ఇచ్చినప్పటికీ కాంపోజిట్ విద్యార్థులకు పసుపు రంగులో ఇచ్చారు. దీంతో పాటు ఈ పేపరులో గద్య ప్రశ్నల్లో 3వ ప్రశ్న ఫక్తు ముఖ్యమంత్రి ప్రచారానికి, స్వోత్కర్షకు వినియోగించుకున్నారు. అమరావతి నిర్మాణంపై ప్రశ్న ఇస్తూ అందులో రాష్ట్ర రాజధాని అమరావతిని 35 సంవత్సరాల్లో దశలవారీగా నిర్మిస్తారని, ఆకాశ హారŠామ్యలు, ఉద్యాన వనాలు, సరస్సులు నిర్మించబడతాయని పేర్కొన్నారు. చివరగా అమరావతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమంటూ ముగింపుకొచ్చారు. వర్షం వస్తే కారిపోయే భవనాలు, పూర్తిస్థాయిలో అసెంబ్లీ హాలు, శాసనమండలి నిర్మితం కాకపోయినా శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటూ పదో తరగతి విద్యార్థులకు తప్పుడు సంకేతాలివ్వడం కోసమే ఇటువంటి ప్రశ్నలిచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు. అమరావతిపై ప్రశ్న ఇవ్వడమే అతిగా ఉంటే అందులో ముఖ్యమంత్రి కృషి అని పేర్కొనడం రాజకీయ దివాళాకోరుతనమని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నారు.
విద్యార్థులకు అదనపు మార్కులివ్వాలి
విద్యార్థులను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్నను తొలగించి విద్యార్థులందరికీ అదనపు మార్కులివ్వాలి. 35 వేల మంది రైతుల భూములు బలవంతంగా లాక్కొని, వారి పొట్ట కొట్టిన చంద్రబాబు ప్రైవేట్ వర్సిటీలకు తక్కువ ధరకే కట్టబెట్టిన విషయాన్ని ఎలా మర్చిపోతాం. సొంత డబ్బాతో విద్యార్థుల ఆలోచనలను పక్కదారి పట్టించి తన గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం.
– కాకి నాని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment