వేటుకు ఐవైఆర్ ఫేస్‌బుక్ పోస్టులే కారణమా?
విజయవాడ: తాము చెప్పినట్లు నడుచుకోకపోతే ఎంత సీనియర్ ఐఏఎస్ అధికారులైనా వేటు తప్పదన్నట్లుగా తయారైంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా నుంచి షేర్ చేసిన కొన్ని పోస్ట్‌లు, ఆయన స్వయంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అలజడి సృష్టించింది. సముచిత స్థానం కల్పిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఆయనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ ఇలా నిత్యం చంద్రబాబుకు సమస్యలు తెచ్చేలా కృష్ణారావు పోస్టులు పెట్టడాన్ని కొందరు టీడీపీ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పచ్చ తమ్ముళ్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున‍్న చంద్రబాబు, ఐవైఆర్‌పై వేటు వేయాలని నిర‍్ణయించినట్లు తెలుస్తోంది.
గతంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలోనూ కొనసాగిన సీనియర్ ఐఏఎస్‌ను ఎలాంటి వివరణ కోరకుండానే ఏక పక్షంగా ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థికశాఖ కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా పలు కీలక పదవులు చేపట్టి ఎంతో నిజాయతీగా నడుచుకున్న అధికారిపై నేడు విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఏపీ సీఎస్‌గా ఆయన పనితీరును మెచ్చిన ఏపీ సీఎం స్వయంగా కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే.
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అరకొర నిధులు ఇస్తున్నారని కొద్దిరోజుల క్రితం తీవ్రంగా విమర్శించిన ఐవైఆర్.. చంద్రబాబుపై కులం కోణంతో ఉన్న పోస్ట్‌ను షేర్ చేయడం సంచలనంగా మారిన నేపథ్యంలో కృష్ణారావు ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందేమోనన్న అనుమానంతో కొందరు టీడీపీ నేతలు ఆయన్ను సంప్రదించారు. తానే పోస్టులు పెడుతున్నానని సమాధానం ఇవ్వడంతో టీడీపీ నేతల ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది.
ఐవైఆర్ షేర్ చేసిన పోస్టుల్లో కొన్ని..
- హైటెక్ సిటీ పేరుతో ఓ విద్యార్థిని రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందారు. 'సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు భూములు కట్టబెట్టారని, వారి విలువను పెంచేందుకే చంద్రబాబు హైటెక్ సిటీ కట్టారని' విద్యార్థిని తన థీసిస్‌లో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ చేసిన పోస్టును కృష్ణారావు షేర్ చేశారు.
- 'స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మీద అప్పట్లో ఓ పత్రిక చంద్రబాబు అండతో వేసిన కార్టూన్.. ఇది ఎన్టీఆర్ ని కించపరచటం కాదా, దీనికి మీకు శిక్షలు లేవా..' అన్న పోస్టును కూడా షేర్ చేయడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను బ్రిటీష్ అధికారి రూథర్‌ఫర్డ్‌తో పోలుస్తూ ఉన్న కార్టున్‌ను కూడా కృష్ణారావు షేర్ చేసిన విషయం తెలిసిందే.
- బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయించడాన్ని, బాహుబలి2 కు అధిక షోలకు ఒకే చెబుతూ.. టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడంపై విమర్శలు చేశారు. చరిత్రను సర్వనాశనం చేసి తీసిన చిత్రంగా శాతకర్ణిని అభివర్ణిస్తూ.. ఇందుకు కారకులైన మూవీ యనిట్‌పై కేసులు పెట్టాల్సిందిపోయి పన్ను రాయితీలు ఎలా ఇస్తారంటూ ఐవైఆర్ ప్రశ్నించారు.