సాక్షి, హైదరాబాద్ : ‘నేను చూసిన ముఖ్యమంత్రుల్లో చెన్నారెడ్డి బెస్ట్. ఆయన సమావేశాలకు వెళ్లాలంటే అధికారులకు ప్రిపరేషన్ తప్పనిసరిగా ఉండేది. యారోగెన్స్‌తోపాటు ఇంటెలెక్చువల్ ఉన్న సీఎం ఆయన’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సాక్షి టీవీ స్పెషల్ లైవ్ షోలో సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుతో ఆయన మాట్లాడారు. స్విస్ చాలెంజ్ విధానంపై తాను దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉందని, న్యాయపరిధిలో ఉండటంతో దీనిపై తాను మాట్లాడబోనని అన్నారు.
ఏపీకి పరిపాలనా రాజధాని సరిపోతోందని పేర్కొన్నారు. విజయవాడతోపాటు ముఖ్య నగరాల్లో సమాంతర అభివృద్ధి జరగాల్సిన అవసరముందని చెప్పారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకరణ సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పరిస్థితి, ఏపీలో పరిస్థితి వేరు అని చెప్పారు. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను తాను విభేదించానని, అందుకే తనను పక్కన పెట్టారని వెల్లడించారు. చంద్రబాబు ధోరణిలో సంకుచితత్వం కనిపించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధాని ఎంపికలో కొందరి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంత తేలిగా వస్తుందని అనుకోవడం లేదని అన్నారు.
కేంద్రం దృష్టిలో టీడీపీ ఊడిపోయే ముక్కు అని, ఊడిపోయే ముక్కు బెదిరిస్తే ప్రయోజనం ఉంటుందా అని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ను చూస్తే ఆశ్చర్యం కలిగిందని, అంచనాలకు మించి రూ. 7వేల కోట్లు వస్తాయని చూపారని, రెవెన్యూ లోటు నుంచి సడన్‌గా మిగులు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బడ్జెట్ అంకెల్లో ఏదో వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment