‘ఐవైఆర్ తొలగింపు మంచి నిర్ణయం’
విజయవాడ: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించి సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిన మనిషి ఐవైఆర్ కృష్ణారావు అని తూర్పారబట్టారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం నీచమైన చర్య అని అన్నారు. కృష్ణారావు అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐవైఆర్ సీఎం చంద్రబాబుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా సోషల్ మీడియాలో కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైర్మన్ కృష్ణారావును ఎలాంటి వివరణ అడగకుండానే ఆయనను పదవి నుంచి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.