
పింఛన్ల తొలగింపుపై పునర్విచారణ చేపట్టాలి
అనంతపురం అర్బన్:
సామాజిక పింఛన్ల జాబితాలో అర్హులను తొలగించడంపై వెంటనే విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యంతో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇస్తున్న రూ.200 పింఛన్‌ను రూ.వెయ్యికి పెంపు చేస్తూనే.. మరోవైపు స్వల్ప కారణాలతో ఏక పక్షంగా జిల్లా వ్యాప్తంగా అర్హులను తొలగించడం సమంజసం కాదని, తొలగించిన వాటిపై పునర్విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ తరహాలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏవీఆర్ హంద్రీ-నీవా మొదటి దశ కాలువ పనులను 80 శాతం పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీటిని తీసుకొచ్చామని, ప్రభుత్వం మొదటి దశ పనులు పూర్తి చేసి, రెండో దశ పనులనూ యుద్ధ ప్రాతిపదికన ముగించి అనంతపురంతో పాటు చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు అందించాలన్నారు. ఈ పనులు పూర్తయితేనే జిల్లాలోని చెరువులు జల కళను సంతరించుకుంటాయన్నారు. జిల్లాలో రూ.7,676 కోట్లతో రూపొందించిన ‘ప్రాజెక్టు అనంత’ను తక్షణం అమలు చేయాలన్నారు. రైతులకు అందాల్సిన రూ.618 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, రూ.184 కోట్ల పంటల బీమా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని, గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన మేరకు ప్రస్తుతం ఎకరాకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.1800 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో రాజధానిపై ప్రకటన చేసిన సందర్భంలో వివిధ జిల్లాలకు ప్రకటించిన ప్రణాళికలో భాగంగా అనంతపురం జిల్లాకు కేటాయించిన ఏవీఆర్ హంద్రీ-నీవా, కుద్రే ముఖ్ ప్రాజెక్టు, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, పుట్టపర్తిలో విమానశ్రయం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ను అమలు చేయాలన్నారు. జిల్లాలో ఎయిమ్స్ బదులు, దాని అనుబంధ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ప్రజల ఆశలపై నీళు చల్లారన్నారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వెనుకబడిన జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సోమర జయచంద్రనాయుడు, నాయకులు నాగరాజు, దాదాగాంధీ, తదితరులు పాల్గొన్నారు.