లండన్: బ్రిటన్ సుప్రీంకోర్టులో ఉబర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాల్సిందేనని స్పష్టంచేస్తూ ఒక కేసులో లండన్ లోని కోర్టు తీర్పునిచ్చింది. దీనితో ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ కింద పనిచేస్తున్న డ్రైవర్లకు బ్రిటన్‌లో కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి సిక్ పే హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఉబర్ తన డ్రైవర్లను ‘స్వయం ఉపాధి’ పొందుతున్న స్వతంత్ర థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లుగా వీరిని సంస్థ వర్గీకరించింది. అంటే చట్టం ప్రకారం వారికి కనీస రక్షణలు మాత్రమే లభిస్తాయి. దీనిపై డ్రైవర్ల పోరాటంతో దీర్ఘంకాలంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వారిని స్వయం ఉపాధి కార్మికులుగానే గుర్తించాలన్న ఉబర్ విజ్ఞప్తిని న్యాయమూర్తి జార్జ్ లెగ్గట్ తోసిపుచ్చారు.
బ్రిటన్ చట్టాల ప్రకారం కనీస ఉపాధి హక్కులు లభించే కార్మికులుగా తమను గుర్తించాలని దాదాపు 25 మంది డ్రైవర్లు ఒక గ్రూప్‌గా 2016కు ముందు ప్రారంభించిన న్యాయపోరాట ఫలితమిది. డ్రైవింగ్‌కు సంబంధించి యాప్ లాగ్ ఆన్ అయిన సమయం నుంచి లాగ్ ఆఫ్ అయిన సమయం వరకూ తన డ్రైవర్లను ఉబర్ ‘‘కార్మికులుగానే’’ పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పటికే ఈ మేరకు ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్, ఎంప్లాయిమెంట్ అప్పీల్ ట్రిబ్యునల్, అప్పీలేట్ కోర్ట్ ఉబర్ డ్రైవర్లకు అనుకూలంగా తీర్పునిచ్చాయి. తాజా రూలింగ్‌పై ఉబర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు. 2016కు ముందు యాప్‌ను వినియోగించిన డ్రైవర్లందరి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడతామని తెలిపారు. కోర్టు ప్రకటన తరువాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ఉబెర్ షేర్లు 3.4 శాతం పడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment