అర్హులందరికీ ఉపాధి | Arhulandariki employment | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఉపాధి

Published Mon, Jan 26 2015 3:49 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

అర్హులందరికీ ఉపాధి - Sakshi

అర్హులందరికీ ఉపాధి

అడిగిన వారందరికీ ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తామని డ్వామా పీడీ చేరెడ్డి పుల్లారెడ్డి హామీనిచ్చారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారిఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లిమాట్లాడారు.

వారు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. ఉపాధి పనులు పెడుతున్నారా, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా... ఎంత కూలి పడుతోంది.. ఇంకా ఏమి కోరుకుంటున్నారు.. తదితర విషయాలను ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
 
వెలుగులోకి వచ్చిన సమస్యలు...
ఒక్కో కుటుంబంలో ఐదుగురు ఉన్నా ఒకే జాబ్ కార్డు ఉంది. దీంతో ఒక్కొక్కరు 20 నుంచి 35 రోజు పని చేసినా 100 రోజులు పూర్తి అవుతున్నాయి. తర్వాత ఉపాధి కరువు అవుతోంది. భూముల్లో వేసిన రాతికత్వలు వ్యవసాయానికి ఇబ్బందిగా మారాయి. సత్వరం వీటిని తొలగించాల్సి ఉంది. పొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మట్టి రోడ్లు వేయాలి. ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, కాల్వలు లేవు. దీంతో మురుగునీరు ఇళ్ల ముందే నిలుస్తోంది. ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచాలి.
 
పీడీ : గ్రామస్తులందరూ బాగున్నారా... గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్నాయా... మీ రు ఉపాధి పనులకు వెళ్తున్నారా?
పాపన్న : సార్.. నేను గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్నాను. అందరికీ అవసరమైన పనులు ఇంకా కల్పించలేదు. ఉపాధి పనులు కల్పిస్తే గ్రామంలో దాదాపు 120 కుటుంబాలకు మేలు జరుగుతుంది.
పీడీ : అందరికీ పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని కుటుంబాలు ఈ పనులను వినియోగించుకోవాలి.
సిద్ధయ్య : సార్.. గ్రామానికి దాదాపు  100 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 30 పూర్తి అయ్యాయి. మిగిలినవి కూడా వివిధ దశలో ఉన్నాయి. ఉపాధి పథకం కింద మొక్కలు నాటడం, పండ్ల తోటల అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వ్యవసాయ కూలీలకు కూడా పనులు కల్పిస్తున్నారు.
పీడీ : ఇంతవరకు ఎన్ని రోజులు పని లభించింది, ఇంకా ఎలాంటి పనులు కోరుకుంటున్నారు?
మద్దిలేటి : సార్.. మా కుటుంబానికి ఇప్పటికే 100 రోజుల పని లభించింది. పనిదినాలను 150 రోజులకు పెంచితే బాగుంటుంది.
పీడీ: అందరికీ ఉపయోగకరమైన పనులు కల్పిస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
పీడీ : ఏమ్మా.. నీ పేరు ఏమిటి? ఉపాధి పనులకు వెళ్తున్నావా... ఏ గ్రూపులో ఉన్నావు, ఎంత కూలీ పడుతోంది?
మహిళ : నమస్కారం సార్.. నా పేరు సుబ్బమ్మ. వెన్నెల గ్రూపులో పనిచేస్తున్నాను. ఇప్పటికే 100 రోజుల పనిదినాలు పూర్తి అయ్యాయి. కూలీ రోజుకు సగటున రూ.120 నుంచి రూ.140 పడింది.
పీడీ: అమ్మా.. వచ్చిన డబ్బులు ఏమి చేసుకుంటున్నావు?
నాగమ్మ : మొన్నటివరకు పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇప్పుడు వారిని చదివించుకోవడానికి ఉపాధి వేతనాలు వినియోగిస్తున్నాం. అదే విధంగా పొలం అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఉపాధి పథకంతో వల్ల మాకు ఎంతో మేలు జరిగింది.
పీడీ : ఏమయ్యా నీ పేరు ఏమిటి? ఉపాధి పనులకు వెళ్తున్నావా.. ఇంతవరకు ఎన్ని రోజులు పనిచేశావు?
కూలీ : సార్.. నా పేరు బాలన్న. ఈ సంవ త్సరంలో ఇప్పటివరకు మా కుటుంబం 70 రోజులు పనిచేసింది. ప్రస్తుతం పనులు లేవు. పనులు పెడితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఇంట్లో ఇద్దరం ఉపాధి పనులపైనే ఆధార పడివున్నాం.
పీడీ : అందరికీ పనులు కల్పిస్తాం.. సరైన విధంగా పనిచేసుకుంటే గిట్టుబాటు వేతనం కూడా లభిస్తుంది. నీ పేరు ఏమిటి, నీకు ఏమైనా సమస్య ఉందా?
కూలీ : సార్.. నా పేరు మౌలాలి. ఇంతవరకు 30 రోజులు పనిచేశాను. పొలం పనులు ఉండటం వల్ల ఉపాధి పనులు చేయలేదు. మా గ్రామంలో గతంలో పొలాల్లో రాతికత్వలు కట్టారు. ఇవి అడ్డంగా మారిపోయాయి. వీటిని ఎత్తివేసే విధంగా పనులు చేపట్టాలి. అడ్డంగా ఉన్న రాతికత్వలను ఎత్తివేయడం వల్ల రైతులకు సౌకర్యంగా సాగుకు అనువుగా ఉంటుంది.
పీడీ : పొలంలో ఉన్న రాతికత్వలను ఎత్తివేసేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉందో లేదో చూస్తాను. అవకాశం ఉంటే కచ్చితంగా ఆ పనులకు అవకాశం ఇస్తాం.
సర్పంచ్ : సార్.. గార్గేయపురం నుంచి కేతవరం వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. ఉపాధి పథకం కింద రోడ్డు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందా..? అదే విధంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మురుగునీరు పోవడం లేదు. ఇళ్ల మధ్యనే నిలుస్తోంది. కాల్వలు నిర్మించడానికి చొరవ తీసుకోవాలి.
పీడీ:  రోడ్డు అభివృద్ధి చేసే పనులకు ఉపాధి పథకంలో అవకాశం ఉండదు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు మాత్రం అవకాశం ఉంది. ఎస్సీ కాలనీ సీసీ రోడ్లు వేయడానికి చర్యలు తీసుకుంటాం.
 మాణిక్యమ్మ : సార్.. రేండేళ్లుగా మేము ఉపాధి పనులపైనే ఆధారపడి బతుకుతున్నాం. మా ఇంటికి ఒక్క జాబ్ కార్డు ఉంది. ఇద్దరం పనిచేస్తాం. ఒక్కొక్కరం 50 రోజులు పనిచేయడంతో 100 రోజుల పనిదినాలు పూర్తి అయ్యాయి. ఇక మాకు ఉపాధి లేదంటున్నారు. పనిదినాలను 150 రోజులకు పెంచాలి. అప్పుడే మాకు ఉపయోగంగా ఉంటుంది.
పీడీ : ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచడం మా చేతిలో లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పనిదినాలను 150 రోజులకు పెంచే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. అవసరమైతే మీ కుటుంబానికి మరో జాబ్ కార్డు ఇచ్చి 100 రోజుల పని కల్పిస్తాం.
మహిళ : సార్... నా పేరు కళ్యాణి. జయంతి గ్రూపులో మేటిగా పనిచేస్తున్నాను. మాకు ఒక జాబ్ కార్డు ఉంది. ఇందులో నలుగురం పనిచేస్తున్నాం. ఒక్కొక్కరం 25 రోజులు పనిచేయడంతోనే 100 రోజు పనిదినాలు పూర్తి అయ్యాయి. ఇక పని లేదంటున్నారు. మా పరిస్థితి ఏమిటి?
పీడీ : మీ ఇంటికి ఉన్న జాబ్ కార్డులో నలుగురు సభ్యులుగా ఉన్నారా... అయితే మీ కుటుంబానికి అదనంగా మరో జాబ్ కార్డు మంజూరు చేస్తాం.  అర్హత కల్గిన అన్ని కుటుంబాలకు అదనపు జాబ్ కార్డులు ఇస్తాం. మీరు ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్లి జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి... మంజూరు చేస్తాం.
పీడీ : అమ్మా.. మీకు ఇప్పుడు ఎంత కూలి పడుతుంది.  ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా...?
మహిళలు : సార్.. మాకు ఇప్పటివరకు కూలి బాగానే పడుతోంది. రూ.120 నుంచి రూ.140 వరకు పడుతోంది. మాకు ఈ కూలి రూ.160 వరకు వచ్చే విధంగా చూడాలి. అప్పుడు మాకు ఉపాధి పనులు గిట్టుబాటు అవుతాయి.
పీడీ : రోజుకు ప్రభుత్వం గరిష్ట కూలి రూ.169గా నిర్ణయించింది. ఈ మేరకు కూలి రావాలంటే రోజుకు కనీసం 8 గంటలు, కొలతల ప్రకారం పని చేయాలి.
గోవర్ధన్ : సార్... ఉపాధి పథకం వ్యవసాయ కూలీలకు ఎంతో తోడ్పడుతోంది. గ్రామంలోని పొలాలకు వెళ్లేందుకు రోడ్లు వేయిస్తే బాగుంటుంది.
పీడీ : వ్యవసాయ భూములకు వెళ్లడానికి వీలుగా మట్టి రోడ్లు వేసేందుకు ఉపాధి హామీ పథకం కింద ప్రొవిజన్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement