ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఫిబ్రవరి 9న నిర్వహిస్తామని పేర్కొంటూ పాఠశాల విద్యా శాఖ శనివారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదనలు ఎన్నికల తర్వాతే డీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఫిబ్రవరి 9న నిర్వహిస్తామని పేర్కొంటూ పాఠశాల విద్యా శాఖ శనివారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. టెట్ కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 4.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నందున దాని నిర్వహణకు అనుమతివ్వాలని కోరింది. నిజానికి డిసెంబర్ 22 లేదా 29 తేదీల్లో టెట్‌ను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ విద్యా శాఖ డిసెంబర్ మొదట్లోనే ప్రతిపాదనలను పంపింది. కానీ ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జనవరి 5న నిర్వహిస్తామని కోరినా స్పందించలేదు.
సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి, ముఖ్య కార్యద ర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు తాజాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి టెట్, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరారు. తరవాత ప్రతిపాదనల ఫైలును కూడా పంపించారు. టెట్, డీఎస్సీలలో ఏ పరీక్షను ఏ తేదీన నిర్వహిస్తారో వివరాలతో రావాల్సిందిగా అధికారులను కిరణ్ ఆదేశించినట్టు తెలిసింది. దాంతో టెట్ నిర్వహణ తేదీలను పాఠశాల విద్యా శాఖ శనివారం ప్రభుత్వానికి పంపింది. మొదట టెట్ నిర్వహించేందుకు సీఎం ఆమోదం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. డీఎస్సీ గురించి తర్వాత ఆలోచించొచ్చనే ఉద్దేశంతో ఉన్నారు. ఫిబ్రవరి 9న టెట్ నిర్వహిస్తే ఫలితాలు వెల్లడించాక డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి పరీక్షల నిర్వహణ దాకా మరో రెండు నెలలు పట్టనుంది. ఆలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముండటంతో ప్రభుత్వం డీఎస్సీ అంశాన్ని పక్కన పెట్టి టెట్ నిర్వహణకు మాత్రమే మొగ్గు చూపుతోంది. ప్రస్తుతానికి ఫిబ్రవరి 9న టెట్ నిర్వహణకు సిద్ధమవుతోంది.