సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యాంధ్ర ఉద్యమానికి, ఆందోళనకారులకు భయపడి మంత్రి టీజీ వెంకటేష్ అమెరికాకు పరిగెత్తారని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి. మోహన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి జిల్లాకు రావడానికి కూడా మొహం చెల్లక ఢిల్లీలో మకాం వేశారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరాహారదీక్ష చేస్తున్న తనను అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. దీక్షను భగ్నం చేసినా... సమైక్యవాదులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు సంఘీభావంగా ఐదురోజుల పాటు నిరాహారదీక్ష చేసిన ఎస్.వి. మోహన్‌రెడ్డిని శనివారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా ఆయన సాయంత్రం వరకు తన నిరాహారదీక్ష కొనసాగించారు. అనంతరం 4 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి ఎస్.వి. సుబ్బారెడ్డి ఆసుపత్రికి వచ్చి టెంకాయనీళ్లి దీక్షను విరమింపజేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వీ ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం చేసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌తో పాటు గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కేంద్రానికి చేసిన విజ్ఞప్తిని పెడచెవిన పెట్టారని అన్నారు. ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసి సీమాంధ్రలో ఆందోళనలకు ఆజ్యం పోశారన్నారు.
25 రోజులుగా సీమాంధ్ర ఉద్యమాలతో అట్టుడికిపోతున్నా సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఉత్తుత్తి రాజీనామాలు చేసి ప్రజలను మోసం చేసే ప్రక్రియను ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, ఈ విషయం ప్రజలందరికీ అర్థమైందని చెప్పారు. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి జిల్లాకు రావడానికి కూడా మొహం చెల్లక ఢిల్లీలో మకాం వేశారని ధ్వజమెత్తారు. జిల్లా మంత్రి టి.జి. వెంకటేశ్ రాజీనామా డ్రామా చేసి ఒకరోజు కర్నూలులో దండలు వేయించుకొని హంగామా చేసి.. ఇప్పుడు అమెరికా పారిపోయాడని ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి, ఆందోళనకారులకు భయపడే ఆయన అమెరికాకు పరిగెత్తాడని ధ్వజమెత్తారు. మరో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఢిల్లీలో మకాం వేశాడని, ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఆర్భాటం చేసి ఏర్పాటు చేసిన టెంట్‌ను పీకేసినారని, ఇక ఆపార్టీ జెండాను పీకేయడం ఒక్కటే మిగిలిందని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులను ప్రజలే తరమి కొడతారని జోస్యం చెప్పారు. తన దీక్ష భగ్నమై నా సమైక్యవాదులతో కలిసి వైఎస్‌ఆర్‌సీపీ తరుపున రాజీలేని పోరాటం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తమ కార్యాచరణ ఆదివారం ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
ఉద్యమానికి భయపడే..అమెరికాకు టీజీ
Published Sun, Aug 25 2013 6:11 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement