
శివతత్వాలు బోధిస్తున్న తనికెళ్ల భరణి, ప్రవచన కార్యక్రమానికి హాజరైన భక్తులు
మానవులు ఒకరితో ఒకరు ప్రేమను పంచుకోవడం..మానవతా విలువలు నిజంగా పాటించడమే శివతత్వమని ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నారు. ఎర్రన సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలులోని లాయరుపేట సాయిబాబా మందిరంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రవచనాల కార్యక్రమంలో తనికెళ్ల భరణి ప్రసంగించారు. మానవ విలువలకు శివతత్వాలను జోడిస్తూ భరణి మాటలు, పాటలు శ్రోతలను రంజింపజేశాయి.
ఒంగోలు అర్బన్: మానవులు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండటం, మానవతా విలువలు పాటించడమే శివతత్వమని ప్రముఖ సినీ నటుడు దర్శక రచయిత తనికెళ్ల భరణి పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడి లాయర్‌పేట సాయిబాబా మందిరంలో ఎర్రన సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మైనంపాటి సాయికుమార్ ఏర్పాటు చేసిన ప్రవచనాలు కార్యక్రమానికి తనికెళ్ల భరణి హాజరై శివతత్వం, గీతాల రూపాన్ని భక్తులకు వివరించారు. నేటి యాంత్రిక యుగంలో మనిషి తన గుణాలు కోల్పోతున్నాడని, మనిషి మనిషిలా ఉండటమే శివతత్వమన్నారు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న పరిస్థితులు పోవాలంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే విలువలు నేర్పాలని సూచించారు. ‘‘ఓ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో తల్లిదండ్రులను అనాథాశ్రమంలో చేర్చవద్దని చెప్పినపుడు ఒక విద్యార్థి నన్ను ప్రశ్నించాడు.
‘చిన్నతనం నుంచి చదువు పూర్తయ్యే వరకు హాస్టల్లో ఉంచి ఇష్టమైన తిండి లేకుండా, ఇష్టమైన ఆటలు లేకుండా నాలుగు గోడల మధ్య పుస్తకాలతో ఉంచితే తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితులు రావా’’ అని ప్రశ్నించాడని తెలిపారు. దీన్నిబట్టి బంధాలు, పాశాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు విలువలు, బంధాలు, తెలుగు భాష, తెలుగు పద్యాలు, సంస్కృతి నేర్పాలని కోరారు. మానవ విలువలను శివతత్వాలకు జోడిస్తూ భరణి ఆలపించిన పాటలు, మాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సాయిబాబా మందిరం ట్రస్టు సభ్యులు, ఇతర ప్రముఖులు తనికెళ్ల భరణిని శాలువా, పూలమాలలతో సత్కరించారు. పొన్నూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సాయిబాబా మందిరం ట్రస్టు అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, డీఎస్పీ జి.శ్రీనివాసరావు, రిటైర్డ్ జడ్జి జగదీశ్వరరావు, డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు, బచ్చల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పాకలలో మహాకవి శ్రీనాథుని విగ్రహం
తనికెళ్ల భరణి వాగ్దానం
పాకల(సింగరాయకొండ): మహాకవి శ్రీనాథుని జన్మస్థలమైన పాకలలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి వాగ్దానం చేశారు. పాకల గ్రామాన్ని ఆయన ఆదివారం రాత్రి సందర్శించారు. స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనాథుడు కొండవీటి రెడ్డి రాజులు ప్రోలయ వేమ భూపతి ఆస్థాన కవిగా బాధ్యతలు నిర్వర్తించారని తనికెళ్ల పేర్కొన్నారు. శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం, కాశీ ఖండం, శివరాత్రి మహత్యం గ్రంథాలు బహు ప్రశస్తి పొందాయని కొనియాడారు. ముందుగా కొండపి వ్యవసాయ మార్కెటింగ్ యార్డులో ఆయన కొండపి ఎమ్మెల్యే స్వామితో సమావేశమయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుదర్శి చంటి, శీలం చంటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment