14వ ఆర్థిక సంఘం ఆ సిఫారసు చేయలేదు
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: జైరాం
న్యూఢిల్లీ: టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఆయన బుధవారం ఢిల్లీలో ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఏపీకి ఇచ్చిన హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. హోదా విషయంలో ఏపీ ప్రజలను, పార్లమెంట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. హోదా ఇవ్వకపోవడానికి రాజ్యాంగాన్ని, 14వ ఆర్థిక సంఘాన్ని కారణాలుగా చూపడం సబబు కాదన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ సిఫారసు చేయలేదని గుర్తుచేశారు.
‘‘గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అప్పటి ఆర్థిక సంఘం సిఫారసులను వ్యతిరేకిస్తూ ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి వాజ్‌పేయిని కలిశారు.అలాంటిది ఇప్పుడెందుకు స్పందించడం లేదు.హోదాపై టీడీపీ ద్వంద్వ ైవె ఖరికి ఇదే నిదర్శనం. విభజన చట్టంలోని హామీలను అమలులో బీజేపీ-టీడీపీ విఫలమయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు.
తప్పుకో బాబూ: ఎన్.రఘువీరారెడ్డి
ప్రత్యేక హోదా సాధించడం చేతకాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఆరుణ్ జైట్లీ ప్రకటనతో తన ర క్తం మరిగిపోతోందంటూ నాటకాలు ఆడడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.