ఇక 4-జి విశాఖ
- రిలయన్స్ సంస్థకు జీవీఎంసీ అనుమతి
- జీవీఎంసీకి రూ.14.32 కోట్లు ఆదాయం
- తొలి విడతలో 120 కి.మీ. మేర కేబుళ్లు
- ఏడాదిలో 4 జి సేవలు!
సాక్షి, విశాఖపట్నం : 2-జి సేవలతో విసిగి వేసారినవారికి 3 జి సేవలు ఊరటనిచ్చాయి. కాస్త ఖర్చెక్కువైనా.. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి తామెప్పుడూ ముందంజలోనే ఉంటామని నగరవాసుల్లో 3జి కనెక్షన్ల వైపు మొగ్గుచూపుతోన్న సంఖ్యే చెప్తోంది. ఇపుడు 4-జి సేవల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశల్ని నెరవేర్చేందుకు రిలయన్స్ జియో ఇన్‌ఫోకాం లి. సంస్థ ముందుకొచ్చింది. 4 జి సేవల్లో భాగంగా ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేసేందుకు అనుమతి కోరుతూ ఈ సంస్థ గత నెల్లో జీవీఎంసీకి దరఖాస్తు చేసుకుంది. దీనికి జీవీఎంసీ నుంచి తాజాగా ఆమోదం దక్కింది.
ఆదాయం రూ.14.32 కోట్లు
తొలి విడతలో భాగంగా నగరంలో సుమారు 120 కిలోమీటర్ల మేర 4 జి సేవలందించేందుకు వీలుగా కేబుళ్లు, టవర్లు, స్తంభాలు వేసేందుకు అనుమతులు కోరుతూ ‘రిలయన్స్’ సంస్థ జీవీఎంసీని ఆశ్రయించింది. ఇందుకు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డక్ట్‌లు తదితర జీవీఎంసీ ఆస్తుల్ని వినియోగించుకోనున్నారు.
సీసీ రోడ్డు తవ్వితే మీటర్‌కు రూ.1569, బీటీ రోడ్డయితే రూ.1998, ఫుట్‌పాత్ తవ్వితే మీటర్‌కు రూ.670 చొప్పున చెల్లించేందుకు సంస్థ అంగీకారం తెలిపింది. తొలి విడతగా ‘రిలయన్స్’రూ.8.83 కోట్లు మంగళవారం జీవీఎంసీకి చెల్లించింది. దీంతో నగరంలోని 1, 2, 3, 4 జోన్లలో సుమారు 62 కిలోమీటర్ల మేర 4 జి వ్యవస్థ ఏర్పాటుకు జీవీఎంసీ ఆమోదం తెలిపింది.
మిగిలిన పరిధిలో కూడా కేబుళ్లు, టవర్లు ఏర్పాటుకు త్వరలోనే రిలయన్స్ సంస్థ చెల్లింపులు చేయనున్నట్టు తెలిసింది. విశాఖతోపాటు గుంటూరు, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో 4 జి సేవల విస్తరణకు ‘రిలయన్స్’ సంస్థ ముందుకొచ్చింది. జీవీఎంసీకే తొలుత వివిధ ఫీజుల రూపంలో డబ్బులు చెల్లించింది. మిగిలిన నగరాల్లో ఇంకా డిమాండ్ నోటీసుల స్థాయిలోనే ఉన్నట్టు తెలిసింది.