దోమతోటి హత్యకేసులో నిందితుల అరెస్టు
తిరువూరు: డీసీసీ కార్యదర్శి దోమతోటి నాగేశ్వరరావు హత్య కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కపాలేనికి చెందిన కొర్రప్రోలు శ్రీనివాసరెడ్డి, గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన మున్నంగి హనుమారెడ్డి, సింగంశెట్టి హనుమంతరావు, శివశంకరరెడ్డి కలిసి నాగేశ్వరరావును 17వ తేదీ రాత్రి అక్కపాలెం వాటర్‌ట్యాంకు వద్ద కత్తులు, రాడ్లతో హతమార్చారు.
శ్రీనివాసరెడ్డి భార్యతో హతుడు నాగేశ్వరరావుకు వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు తమ దర్యాప్తులో వెల్లడించినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య జరగడానికి ఒకరోజు ముందు వీఎంబంజరులోని ఒక హోటల్లో మకాం వేశారని, హత్య చేసిన వెంటనే నిందితులు అంతకు ముందు కొనుగోలు చేసిన అంబాసిడర్ కారులో పారిపోయారని తెలిపారు. హతుడి ద్విచక్రవాహనం సహా పరారైన శివశంకరరెడ్డి మైలవరం వద్ద ఒక లారీని ఢీకొన్న ప్రమాదంలో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. శివశంకరరెడ్డి మినహా మిగిలిన ముగ్గురిని ఉండవల్లిలో అరెస్టు చేశామని, విజయవాడ ఆటోనగర్లో కొనుగోలు చేసిన మారణాయుధాలు, అంబాసిడర్ కారును, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. జగ్గయ్యపేట సీఐ వైవీఎల్ నాయుడు, తిరువూరు సెక్టార్-2 ఎస్‌ఐ కన్నప్పరాజు, పీఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 302 సెక్షను, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు.
దర్యాప్తు కొనసాగింపు
నాగేశ్వరరావు హత్యకేసులో మరికొందరు నిందితులున్నట్లు కాంగ్రెస్ నాయకులు, మాల మహానాడు ప్రతినిధులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. అనుమానితుల్ని విచారిస్తున్నామని, ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.