
మూడు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-తొలిరోజు జీఎస్‌టీ బిల్లు ఆమోదం
-మిగిలిన రెండు రోజులు కరవుపై ప్రత్యేక చర్చ
-ఇతర అంశాలు చర్చకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎత్తుగడ
సాక్షి, అమరావతి
ఈ నెల ఎనిమిది నుంచి మూడు రోజులపాటు జరిగే శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేకంగా కరవుపై చర్చించాలని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభ వ్యూహ కమిటీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఎనిమిదో తేదీన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వం తరపున ఇదే ప్రతిపాదన చేయనున్నారు. ఆదివారం టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశం హైదరాబాద్ ఎన్‌టీఆర్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్‌బాబు, చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, విప్‌లు కూన రవికుమార్, యామినీబాల, ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ టీడీ జనార్ధనరావు, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాపితంగా కరవు తొండవిస్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రతిపక్షం కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నందున ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరిగే శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో చర్చను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. దీంతో కృష్ణా జలాల వివాదం, మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెయిన్స్‌గన్స్‌తో పంటలను కాపాడటం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఓటుకు కోట్లు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమావేశంలో భావించారు.
జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లే ఆలోచన
తెలుగుదేశం అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు కేసుల నుంచి బైట పడేందుకు మేనేజ్ చేసుకోవటం అలవాటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ న్యాయవ్యవస్థను కించ పరిచే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా కోర్టును ఆశ్రయించాలని వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పార్టీ ఎమ్మెల్యే లేదా నేతతో కోర్టులో కేసు వేయించనున్నారు. సమావేశం అనంతరం విప్ కూన రవి విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. మంత్రులు బొజ్జల, రావెల, చీఫ్‌విప్ కాలువ విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, అభివృద్ధి ఆయనకు ఇష్టం లేదని అన్నారు. శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చించేలా సహకరించాలన్నారు.