పార్లమెంట్ బృందం పైనే ఆశలు
నేడు సుబ్రహ్మణ్య కాలనీలో పర్యటన
కష్టాలు తీర్చుతారని స్థానికుల ఎదురుచూపు
అనకాపల్లి: అనకాపల్లి మండలంలో పార్లమెంట్ బృందం పర్యటనపై స్థానికులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. 31 మందితో కూడిన పార్లమెంట్ సభ్యుల బృందం ఆదివారం ఉదయం హుద్‌హుద్‌కు నష్టపోయిన ఏఎమ్‌ఏఎల్ కళాశాలను, సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలోని సుబ్రహ్మణ్యకాలనీని సందర్శించనున్నారు. తుఫాన్ కారణంగా అనకాపల్లి మండలంలోని సుబ్రహ్మణ్య కాలనీ తీవ్రంగా నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపధ్యంలోనే అక్కడ స్థిరపడిన వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వగా, అధికారులు సైతం ఇదే తరహా సంకేతాలు పంపించారు. తుఫాన్ పోయి మూడు నెలలు అవుతున్న తరుణంలో పార్లమెంట్ బృందం చేపట్టనున్న పర్యటన బడుగు, బలహీన వర్గాలలో ఆశలు రేపుతోంది. 11 ఏళ్ల క్రితం సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలోని 388/2 సర్వే నెంబర్‌లో సుబ్రహ్మణ్య కాలనీ దశలవారీగా ఏర్పడింది. 22 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ వందలాది మంది ఆవాసాలను ఏర్పరుచుకున్నారు. వీరంతా రోజువారీ కూలీ పనులు చేసుకోవడంతోపాటు వలస కుటుంబాలకు చెందినవారే. తుఫాన్ తరువాత అందరి దృష్టి సుబ్రహ్మణ్య కాలనీవాసులపైనే పడింది. ప్రస్తుతమిది వాగు పోరంబోకు స్థలంలో ఉందని ఇటీవల పర్యటించిన ఇతర జిల్లాల ప్రతినిధులు నివేదించారు.
కాని 11 ఏళ్లుగా స్థిర నివాసమేర్పరుచుకున్న సుమారు 400 కుటుంబాలకు ఎల్‌పీసీలు ఇచ్చే విషయంలో రెవెన్యూ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెనుకంజ వేస్తున్నారు. సుబ్రహ్మణ్య కాలనీలో నివాసముంటున్న వారంతా తెల్లవారుజామునే సమీపంలోని అనకాపల్లి పరిసర ప్రాంతాలలో పనులు చేసుకునేవారే. వాగు పోరంబోకు కావడంతో అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సుబ్రహ్మణ్యం కాలనీలోనే పక్కా ఇళ్లు నిర్మించడం ఒక ప్రతిపాదన. సమీపంలోని సంపత్‌పురం 2/2 సర్వే నెంబర్‌లో ఐదెకరాల స్థలంలో పక్కా ఇళ్లు నిర్మించడం మరో ప్రతిపాదన. సుమారు 412 ఇళ్లు నిర్మించాలని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో ఆదివారం పర్యటించనున్న పార్లమెంటరీ బృందం స్థానికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు.
తహసీల్దార్ పర్యటన
సుబ్రహ్మణ్య కాలనీలో ఆదివారం పార్లమెంట్ బృందం పర్యటించనున్న నేపధ్యంలో తహశీల్దార్ భాస్కరరెడ్డి, ఆర్‌ఐ సుభాకర్, గాయత్రి, హౌసింగ్ డీఈ ధనుంజయ్ తదితరులు శనివారం ఎఎమ్‌ఎఎల్ కళాశాల, సుబ్రహ్మణ్యం కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు.