- చింతచెట్టుకు చీరతో ఉరి
- అంతాడ యువతితో సహజీవనం
అంతాడ(కొయ్యూరు) న్యూస్‌లైన్: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఆర్.వై.పాలెంకు చెందిన షేక్ మదర్ బాషా(35) అంతాడ గ్రామం శివారులో అనుమానాస్పద పరిస్థితుల్లో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. గ్రామ శివార్లో చింతచెట్టుకు చీరతో ఉరి వేసుకుని మరణించాడు.
వీఆర్‌వో బాలం నాయుడు నుంచి బుధవారం ఫిర్యాదు అందుకున్న కొయ్యూరు ఎస్‌ఐ సీహెచ్.వెంకట్రావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం నెల్లూరు జిల్లా ఆర్.వై.పాలెంకు చెందిన బాషా, విశాఖ జిల్లా కొయ్యూరు మండలం అంతాడకు చెందిన గిరిజన యువతి కూడా విజయ (24) స్నేహితుల ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. కొన్ని నెలల కిందట అంతాడ వచ్చిన బాషా ఆమె తండ్రి గంగరాజుకు ఇంటికి వెళ్లాడు. విజయను ప్రేమించానని చెప్పి ఆర్.వై.పాలెం తీసుకెళ్లాడు.
బాషా వ్యవసాయం చేస్తూ, డ్రయివర్‌గా కూడా పని చేసేవాడు. ఆర్.వై.పాలెంలో కొన్ని రోజులున్న వీరిద్దరూ ఇటీవల సంక్రాంతికి అంతాడ వచ్చారు. ఇక్కడికి వచ్చాక బాషా పూర్తిగా సారా వ్యసనానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి రెండుసార్లు సారా తాగి ఇంటికి వచ్చాడు. రాత్రి 11 గంటల సమయంలో తల్లితో మాట్లాడి బయల్దేరి ఆర్.వై.పాలెం వచ్చేస్తున్నానని చెప్పాడు. రాత్రి సమయంలో వెళ్లడం మంచిది కాదని విజయ చెప్పినా వినకుండా బయల్దేరి వెళ్లిపోయాడు.
బుధవారం ఉదయానికి చింత చెట్టుకొమ్మకు చీరతో ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ సందర్భంగా బాషా రాసిన లేఖను విజయ విలేకరులకు చూపించింది. ‘తన మరణంతో విజయ, ఆమె తల్లిదండ్రులకు సంబంధం లేదని, వారినేమీ అనవద్దని, ఇల్లు, పొలం కొడుకులకు ఇచ్చి నీ కొడుకు కోరిక తీర్చు’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. బాషాకు ఇంతకుముందే ఈ ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైనట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై ఎస్‌ఐ వెంకట్రావు విలేకరులతో మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. మృతదేహాన్ని శవపరీక్షకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తామన్నారు.