కబళిస్తున్న కరువు | Drought haunts a small girl | Sakshi
Sakshi News home page

కబళిస్తున్న కరువు

Published Fri, Jan 17 2014 3:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Drought haunts a small girl

సాక్షి, నెల్లూరు : జిల్లాను కరువు కబళిస్తోంది. గతేడాది నెలకొన్న తీవ్ర వర్షాభావంతో కనుచూపు మేర కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. అధికారుల అవగాహన రాహిత్యం, ప్రణాళికేతర చర్యల ఫలితంగా డెల్టాలోనూ సాగు ప్రశ్నార్థకంగా మారింది. అరకొర వర్షాల నీరు, సోమశిల జలాశయాన్ని నమ్ముకుని సాగు చేపట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావంతో జిల్లాలో వ్యవసాయం వ్యథగా మారింది. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాలతో సోమశిలకు నీళ్లొచ్చినా అవి మెట్ట ప్రాంతాలకు కాదు కదా కనీసం డెల్టాకు కూడా సక్రమంగా అందే పరిస్థితి కానరావడంలేదు. ఇప్పటికే నీళ్లు సక్రమంగా అందక కావలి, కనుపూరు కాలువల కింద వరినాట్లు ఎండిపోతున్నాయి. కొందరు రైతులు ఆశలు వదలి ఉన్న పంటను పశువులకు వదిలేశారు. మిగిలిన వారు ఆశ చావక వరుణుడి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.
 
 ఇక మెట్ట ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వర్షాలులేక జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,800 చెరువులు ఒట్టిపోయాయి. వాటికింద తొందరపడి సాగు చేసిన దాదాపు 40 వేల హెక్టార్ల వరితో పాటు సజ్జ, పొగాకు, మొక్కజొన్న, జొన్న, మినుము, పసుపు, పెసర, ఉల్లి తదితర పంటలు పంటలు సైతం నిలువునా ఎండే పరిస్థితి నెలకొంది. మరి కొద్ది రోజుల్లో వర్షాలు కురవకపోతే అన్నదాతలు తీవ్రంగా నష్టపోనున్నారు. సోమశిలలో నీళ్లున్నా వాటర్ మేనేజ్‌మెంట్ సక్రమంగా లేక అన్ని ప్రాంతాలకు నీరు చేరడం లేదని, అధికారులు స్పందించి ప్రణాళికాపరమైన చర్యలు చేపడితే కొంత మేరైనా రైతులు నష్టాల నుంచి గట్టేక్కే పరిస్థితి ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
 
 మొత్తంగా 2,78,782 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావాల్సి ఉండగా వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం 2,22,534 హెక్టార్లలో 80 శాతం మాత్రమే సాగయ్యాయి.
 
 తగ్గిన వర్షపాతం
 2013లో జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది. గతేడాది జూన్ నుంచి డిసెంబర్  వరకు వర్షపాతం వివరాలను పరిశీలిస్తే జూన్‌లో సాధారణ వర్షపాతం 57 మి.మీ. కాగా జూన్‌లో 34.7 మి.మీ మాత్రమే వర్షం కురిసింది. ఈ లెక్కన 39 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. జూలైలో 86.మి.మీ. సాధారణ వర్షపాతం కాగా 138 మి.మీ. అంటే 61 మి.మీ అదనంగా పడింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 86 మి.మీ. కాగా 103 మి.మీ  అదనంగా 20 మి.మీ. పడింది.
 
 సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 102 మి.మీ కాగా గతేడాది 90 మి.మీ పడింది. కాగా 11 మి.మీ తక్కువగా వర్షపాతం నమోదైంది. ఇక అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 239 మి.మీ కాగా 16 మి.మీ తక్కువగా 203 మి.మీ మాత్రమే వర్షం పడింది. నవంబర్‌లో సాధారణ వర్షపాతం 313 మి.మీ. కాగా 160 మి.మీ మాత్రమే పడింది. 49.మి.మీ తక్కువగా నమోదైంది. డిసెంబర్‌లో సాధారణ వర్ష పాతం 109 మి.మీ కాగా కేవలం 6.4 మి.మీ మాత్రమే పడింది. అంటే 94.మి.మీ తక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం కంటే 44 మి.మీ తక్కువగా నమోదైంది.  
 
 సోమశిలలో నీరు ఉన్నా ప్రయోజనం సున్నా
  ఎగువ రాష్ట్రమైన కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో గతేడాది చివర్లో సోమశిలకు 67 టీఎంసీల మేర నీరు చేరింది. అయితే సోమశిల నుంచి 35 టీఎంసీలకు పైగా నీటిని అధికారులు ముందస్తుగా కండలేరుకు తరలించారు. నెల్లూరు జిల్లా రైతాంగం ప్రయోజనాల కోసం కాకుండా చిత్తూరు జిల్లా ప్రజల ప్రయోజనాల కోసమే నీటిని తరలించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమశిల పరిధిలో తొలి పంటకు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరందస్తామని పేరుకు ప్రకటించారు. కానీ నాట్లకు కూడా నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాట్లు పూర్తి చేసుకున్న కావలి, కనుపూరు కాలువల కింద వరినాట్లు ఎండిపోతున్నాయి. మరో వైపు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,800 చెరువుల కింద ముందస్తుగా సాగు చేసిన 36 వేల హెక్టార్ల వరి పంట నిలువునా ఎండి పోనుంది. వరితోపాటు మెట్ట ప్రాంతాల్లో సాగైన సజ్జ, మిరప, పొగాకు, శనగ తదితర పంటలు వందలాది హెక్టార్లలో ఎండు దశకు చేరుకున్నాయి. జనవరి చివరాంతానికి వర్షాలు కురవకపోతే ఈ పంటలన్నీ ఎండి పోయే పరిస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది.
 
 పెండింగ్ ప్రాజెక్టులతో సాగునీటి కష్టాలు
 వైఎస్సార్ మృతితో జిల్లాలో జలయజ్ఞం పనులు ఎక్కడి వక్కడే నిలిచి పోయాయి. వైఎస్సార్ హయాంలో సంగం, నెల్లూరు ఆనకట్టల నిర్మాణంతో పాటు డెల్టా, నాన్‌డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. వీటితో పాటు కనిగిరి, నెల్లూరు, సర్వేపల్లి రిజర్వాయర్ల పనులు, కనుపూరు, గండిపాళెం కుడి, ఎడమ కాలువ పనులు చేపట్టారు. ఇందు కోసం దాదాపు రెండు వేల కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు. కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ మృతితో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో ఆ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇవన్నీ పూర్తయి ఉంటే 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేది. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియడంలేదు. దీంతో సోమశిల పరిధిలో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు.
 
 అందని పరిహారం
 జిల్లాలో 2011 నుంచి 2013 వరకూ సంభవించిన తుపాన్ల వల్ల 6,233 మంది రైతులు నష్ట పోయారు. 3990.43 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో రూ.2 కోట్ల 6 లక్షల 26 వేల అన్నదాతులు నష్టపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కానీ వీరికి నష్టపరిహారం అందింది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి సోమశిల నీటిని రైతులకు సక్రమంగా అందించే చర్యలు తీసుకోకపోతే ఇంతకు వంద రెట్లు రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement