రాజధాని గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, వైద్యం, ఉపాధికల్పన తదితర హామీలు పూర్తిగా అమలయ్యేలా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలు పంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి మంత్రులు పుల్లారావు, నారాయణ గ్రామస్తులతో సమావేశమయ్యారు.
ఆర్‌డీవో స్థాయి అధికారులుగా ఉన్న సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్లు జవాబుదారీ తనంతో వ్యవహరించడం లేదని పత్తి పాటి పుల్లారావు అన్నారు. ఇప్పటివరకు ఏ విషయంలోనైనా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో సంప్రదించావా అని సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ ఏసురత్నంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ ఐనవోలు గ్రామానికి రూ. 30 లక్షలు మంజూరు చేస్తానని తాను ఇచ్చిన హామీ అమలు కాకపోవడం తమ తప్పేనన్నారు. ఈ గ్రామంలోని అన్ని సమస్యలను బుధవారం నాటికి పరిష్కరించి గురువారం మరోసారి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.