జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు తీసుకువస్తామని రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ తెలిపారు.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు తీసుకువస్తామని రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు. కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి చైర్మన్ హోదాలో ఆయన హాజరై అధ్యక్షత వహించారు. ఉపాధి హామి, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇందిర జలప్రభ, ఇంటిగ్రేటెడ్ మెగా వాటర్‌షెడ్, గృహనిర్మాణం, పెన్షన్లు తదితర అంశాలపై చ ర్చించారు. డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం తమ శాఖ ప్రగతిని వివరించారు.
ఇందిర జలప్రభ కింద మరో 12 వేల ఎకరాలకు ప్రతిపాదనలు పంపామన్నారు. 11 వేల ఎకరాల్లో నీరందించేందుకు బోర్ పాయింట్లు గుర్తించామన్నారు.ఎంపీ కల్పించుకుంటూ ఐదు మంది రైతులు కలసి ఒక బోరుతో వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేవన్నారు. రెండు, మూడు ఎకరాలున్న రైతులను గుర్తించి వారికి వ్యక్తిగతంగా బోర్లు మంజూరు చేస్తే ఉపయోగముంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై తీర్మానాన్ని ఆమోదించి ముఖ్యమంత్రికి పంపాలని కలెక్టర్‌కు సూచించారు.
ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు మాట్లాడుతూ జియాలజిస్టులు చూపుతున్న పాయింట్లలో 15 శాతం ఫెయిల్ అవుతున్నాయని ఆరోపించారు.
రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కరువు మండలాల్లో ఉపాధి కూలీలకు 150 రోజులు పనులు కల్పించాలని కోరారు. జలప్రభ కింద ఏర్పాటు చేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్ల విషయంలో ఆలస్యమవుతోందన్నారు. మెగా వాటర్ షెడ్స్ నిర్మాణాలు ఎక్కడ చేపడుతున్నారో తమకే తెలియడం లేదన్నారు.
కొత్త పెన్షన్లు ఎవరికీ ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ షేక్ హుసేన్ తెలిపారు. ఖాళీలుంటే తప్ప భర్తీ చేయడం లేదన్నారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ నిర్మల మాట్లాడుతూ ఆస్పత్రి వర్గాలనుంచి తమకు కూడా ఫిర్యాదు వచ్చిందన్నారు. ఝరికోన ప్రాజెక్టు నీటినిముఖ్యమంత్రి పీలేరుకు తరలించడం వల్ల తన నియోజకవర్గంలోని సంబేపల్లె, చిన్నమండెం మండలాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని శ్రీకాంత్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు.
ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ అవుకు నుంచి గండికోటకు నీరు ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం గండికోటలో ఉన్న నీటిని మైలవరం రిజర్వాయర్‌కు తరలించి ఎండిపోతున్న పంటలను ఆదుకోవాలని కోరారు. ఇందుకు కలెక్టర్ శశిధర్ బదులిస్తూ గండికోటలో ప్రస్తుతం మూడు టీఎంసీల నీరు ఉందన్నారు. ఇంకా రెండు టీఎంసీలు అవుకు నుంచి గుర్రప్ప చెరువు ద్వారా మైలవరానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు.
రాజీవ్ యువ కిరణాల అమలుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా యువత ఇక్కడే ఉద్యోగం కావాలని కోరుకుంటోందని తెలిపారు. జీతాలు తక్కువగా ఉన్నందున హైదరాబాద్ లాంటి దూర ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదన్నారు. ఫ్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లుగా ఓవర్‌సీస్‌కు పంపుదామంటే అవసరమైన స్కిల్స్ ఉండడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకుని యువతలో స్కిల్స్ పెంపొందించడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తే బాగుంటుందని సూచించారు. ఇందుకు ఎంపీ సాయిప్రతాప్ స్పందిస్తూ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళతామన్నారు. ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఇతర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.