
కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు
రైలుపేట (గుంటూరు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రానికీ ఇవ్వని ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చి అధిక శాతం నిధులు ఇస్తున్నా.. మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా రాష్ట్ర నేతలు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె.కోటేశ్వరరావు చెప్పారు. గురువారం గుంటూరు అరండల్‌పేటలోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణంలో భాగంగా రాజ్‌భవన్, అసెంబ్లీ, ఇతర భవన నిర్మాణాల కోసం గత ఏడాది కేంద్రం రూ.500 కోట్లు ఇస్తే.. వాటిలో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదని వెల్లడించారు.
విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌ల అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు ఇస్తే వాటిల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. పార్టీని 2019 కల్లా పూర్తి స్థాయిలో విస్తరింపచేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం రాష్ట్రానికి ఏ పథకానికి నిధులు మంజూరు చేసిందో ఆ పథకాలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గుంటూరు నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నేరేళ్ల మాధవరావు, అప్పిశెట్టి రంగా, బోరుగడ్డ బుల్లిబాబు, మాధవరెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.