నగరంలోనే పోలీస్ బాస్
ఇరిగేషన్ ఎస్‌ఈ బంగళాలో డీజీపీ క్యాంపు కార్యాలయం
ఆఫీసర్స్ క్లబ్ కూడా కేటాయింపు
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
విజయవాడ సిటీ : రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ (డిజీపీ) క్యాంపు కార్యాలయం ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు పోలీసు శాఖ సమాయత్తమవుతోంది. ఇటీవల వార్షిక నేర నివేదిక విడుదల కార్యక్రమం కోసం నగరానికి వచ్చిన డీజీపీ జె.వి.రాముడు ఇక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు ఇంకా సమయం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో సోమవారం ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో డీజీపీ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నేడు సీఎస్ రాక
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు మంగళవారం నగరానికి రానున్నట్టు అధికార వర్గాల సమాచారం. మధ్యాహ్నం 2గంటలకు నగరానికి చేరుకొని గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎంపిక చేసిన ప్రాంతాలను పరిశీలించి ఖరారు చేస్తారు. రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం నిర్వహణ, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేస్తారు. తదుపరి బుధవారం ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంపై అధికారులతో సమావేశమై చర్చిస్తారు. ప్రధాన కార్యదర్శితో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ప్రాంతం ఎంపిక కోసం డీజీపీ జె.వి.రాముడు కూడా వచ్చే అవకాశం ఉందని కమిషనరేట్ అధికారుల సమాచారం. అయితే అధికారికంగా ఆయన పర్యటన ఖరారు కాలేదు.