పంచాయతీరాజ్ సంస్థల ఖాతాల నిర్వహణలో డొల్లతనాన్ని రాష్ర్ట ఆడిట్ నివేదిక బయట పెట్టింది. పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపాలిటీలు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల ఖాతాల నిర్వహణలో అవకతవకలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. 2010-11 ఆర్దిక సంవత్సరం ఆడిటు నివేదికను రాష్ట్ర ఆడిట్ శాఖ గురువారం అసెంబ్లీకి సమర్పించింది. జిల్లాలో సుమారు రూ.15.75 కోట్ల మేర నిధులు, గ్రాంట్లకు సంబంధించి 11774 అభ్యంతరాలను ఆడిటు నివేదిక ఎత్తిచూపింది. పన్నులు, అద్దెలు వసూలు చేస్తున్నా సంబంధిత అకౌంట్లలో జమ చేయడంలో జరిగిన అవకతవకలు ఆడిటు నివేదిక సాక్షిగా వెల్లడయ్యాయి.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపాలిటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాలపై నిర్వహించిన ఏకీకృత ఆడిటు, సమీక్ష నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. మొత్తం 19 అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ సంస్థల ఆదాయ, వ్యయాల తీరును సమీక్షించారు.
జిల్లాలో 11,774 పనులకు సంబంధించి రూ.15.75 కోట్ల మేర నిధులకు లెక్కలు సక్రమంగా లేవని ఆడిట్ నివేదిక తేల్చింది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల్లోనే నిధులు, గ్రాంట్లకు సంబంధించిన లెక్కలు సరిగా లేవని నివేదికలో పేర్కొన్నారు. 2002-03 నుంచి 2010-11 మధ్య కాలంలో రూ.67.99 లక్షల మేర జిల్లా పరిషత్‌కు అద్దెల బకాయి రావాల్సి ఉన్నా వసూలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
జిల్లా పరిషత్‌లో వివిధ అవసరాల కోసం తాత్కాలిక అడ్వాన్సుగా చెల్లించిన రూ.68.49 కోట్లను సర్దుబాటు చేయకపోగా, అందుకు సంబంధించిన బిల్లులు కూడా సమర్పించలేదు.
ఇంటిపన్నులో నుంచి ఎనిమిది శాతం మేర లైబ్రరీ సెస్సుగా చెల్లించాల్సిన రూ.33వేలు బకాయి ఉంది. రాష్ట్ర ఆర్దిక సంస్థ (ఎస్‌ఎఫ్‌సీ) గ్రాంటు కింద చేపట్టిన పనులకు సంబంధించి రూ.86.11 లక్షలకు సంబంధించిన వివరాలు ఆడిట్ విభాగానికి ఇవ్వలేదు.
కొన్ని గ్రామ పంచాయతీలు ఇంటిపన్నుతో పాటు ఇతర పన్నులు వసూలు చేసినా పంచాయతీ అకౌంట్లో జమ చేయలేదు. ఉదాహరణకు కోస్గిలో రూ.1.93 లక్షలు, ఐజలో రూ.3.06లక్షలతో పాటు రాజోలి, వడ్డేపల్లి, ఆత్మకూరు, కొత్తకోట పంచాయతీల్లో ఇదే రకమైన అవకతవకలు చోటు చేసుకున్నాయి. సెల్‌ఫోన్, వాహన ఇంధన బిల్లులు జిల్లా పరిషత్ నుంచి రూ.29వేల మేర అదనంగా చెల్లించారు.
వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో నిధులు ఖర్చు చేసినట్లు చెప్తున్నా, అందుకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించలేదు. పశు సంవర్దక శాఖ (రూ.69.06లక్షలు), మత్స్య శాఖ (రూ.8.5లక్షలు), వ్యవసాయ శాఖ (రూ.21.78లక్షలు), జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ (రూ.3.36కోట్లు) యూసీలు సమర్పించలేదు.
అందుబాటులో ఉన్న నిధుల కంటే పంచాయతీలు, మండల పరిషత్‌లు రూ.16.94లక్షలు అదనంగా ఖర్చు చేశాయి. రూ.24.07లక్షల మేర నిధులు ఇతర అవసరాలకు మళ్లించాయి.
389 గ్రామ పంచాయతీలు నిర్దేశించిన గడువులోగా రూ. 4.02లక్షలను వినియోగించడంలో విఫలమయ్యాయి.
నిబంధనలకు విరుద్ధంగా మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు రూ.5.64లక్షలు ఖర్చు చేశాయి. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.54వేలు సర్దుబాటు చేయలేదు. రూ.91వేల ఆడిట్ ఫీజును కూడా చెల్లించలేదు.
వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదాయ పన్ను, వ్యాట్, సీనరేజీ, మార్కెట్ ఫీజులను వసూలు చేసినా సంబంధిత ఖాతాల్లో జమ చేయలేదు. ఉద్యోగుల జీతాల నుంచి రూ.43,250 వృత్తిపన్ను వసూలు చేసినా సంబంధిత ఖాతాలో జమ చేయడంలో జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్లక్ష్యం వెల్లడైంది.
పద్దుల మాయ..!
Published Fri, Feb 14 2014 4:30 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement