మంత్రి శైలజానాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గంలోని కల్లూరు అగ్రహారం గ్రామంలో ఆంజనేయులు (డబ్ల్యుఏపీ 1213012001245) కార్డులో నలుగురు కుటుంబ సభ్యులున్నట్లు నమోదు చేశారు. ఒక్కో వ్యక్తికి 4 కేజీల చొప్పున అతని కుటుంబానికి 16 కేజీల బియ్యం ఇవ్వాలి.
వాస్తవానికి అతనికి ప్రతి నెలా ఇస్తున్న బియ్యం నాలుగు కేజీలు మాత్రమే. రెండేళ్లుగా అతను నాలుగు కేజీలతో సరిపెట్టుకుంటున్నాడు. 16 కేజీల బియ్యం ఇవ్వమని కోరుతూ రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. తనకు అన్యాయం జరుగుతోందని సోమవారం అనంతపురంలో నిర్వహించిన గ్రీవెన్స్ (ప్రజావాణి)కు వచ్చి గోడు వెళ్లబోసుకున్నాడు. సాక్షాత్తూ మంత్రి నియోజకవర్గంలోనే రేషన్ పంపిణీ ఇలా జరుగుతుంటే.. ఇక మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సరుకులు పూర్తి స్థాయిలో పేదలకు అందడం లేదు. రేషన్‌డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. అరకొరగా పంపిణీ చేసి.. మిగతా సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం 11,53,713 కార్డులున్నాయి. ఇందులో 1,19,969 అంత్యోదయ కార్డులు, 8,55,784తెల్ల కార్డులు, 10,759 ట్యాప్(టెంపరరీ) కార్డులు, 70,209 రచ్చబండ-1,2 కార్డులు, 96,997 రచ్చబండ-3 కార్డులు ఉన్నాయి. ఇవి కాకుండా 54,529 గులాబి కార్డులు ఉన్నాయి. గులాబీ కార్డులు మినహా మిగిలిన కార్డులకు ప్రతి నెలా జిల్లాలో 2,685 చౌక దుకాణాల ద్వారా 14,745.756 మెట్రిక్ టన్నుల బియ్యం, 10,48,722 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు.
అమృత హస్తం పథకం కింద పసుపు 105.132 టన్నులు, కారంపొడి 262.830 టన్నులు, చింతపండు 525.661 టన్నులు, ఉప్పు 1051 టన్నులు, గోధుమ పిండి 513.600 టన్నులు, గోధుమలు 513.600 టన్నులు, పంచదార 529 టన్నులు, కందిపప్పు 1051 టన్నులు, పామాయిల్ 10,51,000 లీటర్లు జిల్లాకు కేటాయిస్తున్నారు.
స్టాక్ పాయింట్లలో బియ్యం బస్తాలకు కన్నం
రేషన్ బియ్యాన్ని జిల్లాలోని 24 స్టాక్ పాయింట్ల ద్వారా చౌకదుకాణాలకు సరఫరా చేస్తున్నారు. స్టాక్ పాయింట్లలోనే బియ్యం బస్తాలకు రంధ్రాలు పడుతున్నాయి. దీంతో బస్తాలో నాలుగైదు కేజీల దాకా తక్కువగా ఉంటున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఈ నెపంతో పేదలకు ఇచ్చే రేషన్‌లో డీలర్లు కోత వేస్తున్నారు. నెలకు సుమారు 800 క్వింటాళ్ల మేర బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
మూడు రోజులే పంపిణీ
డీలర్లు సరుకులను పూర్తి స్థాయిలో పంపిణీ చేయకుండానే చేతులెత్తేస్తున్నారు. ప్రతి నెలా 15వ తేదీలోపు డీలర్లు డీడీలు తీయాలి. 20 నుంచి వచ్చే నెల ఒకటో తేదీలోగా డీలర్లకు సరుకులు సరఫరా చేయాలి. డీలర్లు సకాలంలో డీడీలు తీయకపోవడం, సకాలంలో డీడీలు తీసినా సరుకులు మాత్రం డీలర్లకు ఆలస్యంగా చేరుతున్నాయి. దీంతో పేదలు రేషన్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలి. అయితే మూడు రోజులు మాత్రమే పంపిణీ చేస్తున్నారని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట పంపిణీ చేస్తుండటంతో గ్రామాల్లో రైతులు, కూలీలు పనులకు వెళ్లడం వల్ల సరుకులను తీసుకోలేకపోతున్నారు.
అడ్రస్ లేని పామాయిల్..
జిల్లాలో పామాయిల్ కొరత తీవ్రంగా ఉంది. సగం మండలాలకు నెల రోజులుగా పామాయిల్ సరఫరా కాలేదు. శివారు గ్రామాల్లోని కార్డుదారులకు డీలర్లు కిరోసిన్ పంపిణీ చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక రచ్చబండ-3 కింద కూపన్లు పొందిన వారికి కూడా కిరోసిన్ వేయలేదు. అమ్మహస్తం పథకం కింద పంపిణీ చేసే పసుపు, కారంపొడి, ఉప్పు, గోధుమ పిండి, గోధుమలు, పంచదార, కందిపప్పు, చక్కెర, పామాయిల్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. ఇక చింత పండు నిండా పిచ్చలే ఎక్కువగా ఉండటంతో పాటు నల్లగా ఉండడం వల్ల తీసుకోవడానికి కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు.
అధికారులు ఏం చేస్తున్నట్లు?
ప్రజావాణిలో రేషన్ పంపిణీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డీలర్లు ఇంతగా పేట్రేగిపోతూ సరుకులు కాజేస్తున్నా పట్టించుకోవడం లేదంటే ఆ పాపంలో అధికారులకూ భాగం ఉందని జనం ఆరోపిస్తున్నారు.
సక్రమంగా అందేలా చూస్తాం : శాంతకుమారి, డీఎస్‌ఓ
తెల్ల, అంత్యోదయ కార్డుదారులకు కిరోసిన్ ఇంకా పంపిణీ చేయలేదు. వీరికి 10,48,722 లీటర్లు కిరోసిన్ కావాల్సి ఉంది. కోటా తెప్పించి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. రచ్చబండ-3 కింద కూపన్లు పొందిన వారికి కూడా కిరోసిన్ పంపిణీ చేస్తాం. సరుకులు అందరికీ అందేలా చూస్తాం.
పామాయిల్ కొరత ఉంది : అమ్మ హస్తం పథకం కింద 9 సరుకులను పంపిణీ చేస్తున్నాం. పామాయిల్ మాత్రం పంపిణీ చేయడం లేదు. పామాయిల్ కొరత ఉంది. చింతపండు తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. కార్డుదారులు అడిగిన సరుకులన్నీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
- వెంకటేశం, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ
సరుకులు హుష్..
Published Thu, Dec 19 2013 3:25 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement