ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సందడి
కర్నూలు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కర్నూలు శివారులోని వెంకాయపల్లె వద్దనున్న పుల్లయ్య, రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం కర్నూలు పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టారు. నంద్యాల పార్లమెంట్‌తో పాటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నంద్యాల ఆర్‌జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
పోలింగ్‌లో ఈవీఎంలు వినియోగించడంతో ఫలితాలు మధ్యాహ్నం లోపు వెలువడ్డాయి. జిల్లాలోని రెండు పార్లమెంట్‌తో పాటు 11 శాసనసభ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రౌండ్ల వారీగా ఆధిక్యత ప్రదర్శించారు. ఫలితాలు వెలువడగానే లెక్కింపు కేంద్రాల బయట వేచి ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. విజేతల తరఫున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
కర్నూలు, డోన్, పత్తికొండ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఉదయం నుంచే ఆయా కేంద్రాల వద్దకు ప్రధాన పార్టీల అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. లోపల ఉన్న వారితో సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ వివరాలు తెలుసుకోవడంతో ప్రతి ఒక్కరూ బిజీబిజీగా గడిపారు. ఫలితం వెలువడగానే ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.
కలెక్టర్, ఎస్పీ పరిశీలన
కర్నూలు లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల ఓట్ల లెక్కింపును జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురాంరెడ్డి.. నంద్యాలలోని ఆర్‌జీఎం కళాశాలలో చేపట్టిన ఓట్ల లెక్కింపును జాయింట్ కలెక్టర్ కన్నబాబు పర్యవేక్షించారు. నియోజకవర్గాల వారీగా కేంద్రాలను సందర్శించి లెక్కింపు తీరును పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విధుల్లోని అధికారులను ఆదేశించారు.
గట్టి బందోబస్తు
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు.
గుర్తింపు కార్డులు కలిగి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. పార్టీ కార్యకర్తలు, అభ్యర్థుల అనుచరులు, అభిమానులు ఆయా కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చినప్పటికీ 200 మీటర్ల దూరంలో ఉండేలా చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సెక్షన్ 144 సీఆర్‌పీసీ 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేశారు. కర్నూలు కౌంటింగ్ కేంద్రాల వద్ద హోంగార్డ్స్ కమాండెంట్, ఏఆర్ అదనపు ఎస్పీ, నంద్యాల కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఓఎస్‌డీ పర్యవేక్షించారు.
వాహనాల దారి మళ్లింపు
ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా కేంద్రాల వద్ద వాహనాలను దారి మళ్లించారు. కర్నూలు, నందికొట్కూరు వాహనాలను నంద్యాల చెక్‌పోస్టు, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మీదుగా పసుపుల, సూదిరెడ్డిపల్లె, వెంకాయపల్లె ఎల్లమ్మ వద్ద చేరుకునేలా చర్యలు చేపట్టారు. నంద్యాల వైపు నుంచి వచ్చే వాహనాలను కూడా అదే మార్గంలో కర్నూలుకు చేరుకునేలా పోలీసులు ఏర్పాటు చేశారు. నంద్యాల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రధాన రోడ్డులో కాకుండా సర్వీసు రోడ్లలో వాహనాలను మళ్లించారు.
ఆద్యంతం ఉత్కంఠ
Published Sat, May 17 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM
Advertisement
Advertisement