ఆ జంట ఒక్కటైంది
Published Tue, Mar 7 2017 9:53 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
రొళ్ల (మడకశిర) : పెళ్లి కొడుకు తన తప్పు తెలుసుకోవడంతో ఈ నెల 2న ఆగిన ఓ వివాహం తిరిగి సోమవారం జరిగింది. దీంతో ఆ జంట మళ్లీ ఒకటయ్యారు. వివరాలిలా ఉన్నాయి. రొళ్ల మండలం కాకి గ్రామానికి చెందిన లక్కమ్మ గోవిందరాజు దంపతుల కుమార్తె ఆశను గుడిబండ మండలం కొంకల్లు గ్రామానికి చెందిన నరసమ్మ, హనుంతరాయప్ప రెండవ కుమారుడు రవికుమార్‌తో పెద్దలు వివాహం నిశ్చయించారు.
పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 9న నిశ్చితార్థం చేశారు. ఇరు కుటుంబాల వారు కలిసి 02.03.2017న గురువారం ఉదయం 10.15 నుండి 11 గంటల మధ్యలో రొళ్ల లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో పెళ్లి జరిపించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 2వ తేదీ వేకువజామున బహిర్భూమికి వెళ్లి వస్తానని పెళ్లి కొడుకు పరారయ్యాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లికొడుకుపై అప్పట్లో రొళ్ల పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు. అయితే తన తప్పు తెలుసుకున్న రవికుమార్ స్నేహితులతో కలిసి వచ్చి రొళ్ల ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఆశను వివాహం చేసుకున్నాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Advertisement