
బంగారం పండించే రోజులు వస్తాయి..
కరువుకు నిలయమైన అనంతపురంలో జిల్లాలో బంగారం పండించే రోజులు వస్తాయని ఇందుకోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
కళ్యాణదుర్గం /కంబదూరు : కరువుకు నిలయమైన అనంతపురంలో జిల్లాలో బంగారం పండించే రోజులు వస్తాయని ఇందుకోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు చదువుల కోసం ఖర్చు పెడుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జపాన్ ముందుకొస్తోందన్నారు. శుక్రవారం కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో రూ.82 లక్షలతో నిర్మించిన బీసీ బాలుర వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు.
ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పోలవరం పూర్తి అయితే డెల్టాకు సాగు నీరు అందుతుందని, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అవసరమైతే పోలవరం నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమకు తీసుకువస్తామన్నారు. సాగు నీరు అందితే అనంతపురం నంబర్ వన్ జిల్లాగా నిలబడుతుందన్నారు. ప్రజలతో చీకొట్టించుకున్న నాయకులు రుణమాఫీ పై విమర్శలు చేస్తున్నారని, వారి నాటకాలను రైతులు నమ్మరన్నారు.
నూతిమడుగులో బీసీ బాలికల వసతి గృహ నిర్మాణాన్ని ఆరునెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఆరునూరైనా రైతు రుణమాఫీ చేసితీరుతామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పునరుద్ఘాటించారు. జిల్లాలోని 1263 చెరువుల మరమ్మతులకు కృషి చేస్తామన్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకానికి రూ.580 కోట్లు వెచ్చించినా ఆశించిన ఫలితం లేదని, దీనిని సరిదిద్ది 917 గ్రామాలకు తాగునీరందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి, జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడారు.