చచ్చినా పట్టించుకోరా.. | The dead do not care .. | Sakshi
Sakshi News home page

చచ్చినా పట్టించుకోరా..

Published Wed, Feb 18 2015 2:43 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

The dead do not care ..

ఒంగోలు సెంట్రల్: ఒంగోలు రిమ్స్ దక్షిణం వైపు గేటు వద్దకు అడుగుపెడితే చాలు..భరించలేని దుర్వాసన వస్తుంది. రిమ్స్‌లోని అనాథ శవాలన్నీ అక్కడే ఓ చిన్న రేకుల గదిలో కుళ్లిపోయి..పురుగులు పట్టి దారుణమైన స్థితిలో ఉంటాయి. రిమ్స్ అధికారులు మాత్రం మున్సిపల్ అధికారులపై నెపం వేసి ఊరుకుంటున్నారు. రిమ్స్ ముఖద్వారం నుంచి లోపలికి వచ్చే మార్గంలో ఎడమవైపున మార్చురీ నిర్మించారు.  రిమ్స్ మార్చురీలో కేవలం ఆరు మృతదేహాలను మాత్రమే నిల్వ చేసేందుకు ఫ్రీజర్స్ ఉన్నాయి. అందులో రెండు పనిచేయడం లేదు. ప్రతి రోజూ జిల్లాలో జాతీయ రహదారిపై ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ మరణాలు, మెడికో లీగల్ మరణాలు (ఆత్మహత్యలు, హత్యలు) సంభవిస్తుంటాయి.  రిమ్స్ వైద్య కళాశాల కాబట్టి ఫోరెన్సిక్ వైద్యులు ఉంటారు. హత్యలతో పాటు అనుమానాస్పద, యాక్సిడెంట్ మరణాలకు పోస్టుమార్టం రిమ్స్‌లోనే నిర్వహిస్తుంటారు.
 
 దీంతో ఈ మార్చురీకి శవాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శవాలు వచ్చిన తర్వాత పోలీసుల పంచనామా పూర్తయ్యాక వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. అనంతరం శవాలను బంధువులకు అప్పగిస్తారు. ఇదంతా జరగడానికి కనీసం ఒకరోజుపైగా సమయం పడుతుంది. అదే విధంగా  హెచ్‌ఐవీ, టీబీ, హెపటైటిస్-బీ వంటి వ్యాధులతో ఉన్నవారిని కుటుంబ సభ్యులు రిమ్స్‌లోనే వదిలేసి వెళుతుంటారు. ఇటువంటివారు మరణిస్తే శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఎవరూ రారు. ఈ  శవాలను కూడా మూడు రోజుల పాటూ ఫ్రీజర్‌లో భద్రపరిచి బంధువులు ఎవరూ రాకపోతే మున్సిపల్ కార్పొరేషన్‌లోని శానిటేషన్ సిబ్బందికి సమాచారం అందించాలి. కానీ రిమ్స్ మార్చురీలో స్థలం లేకపోవడంతో మార్చురీ పక్కనే ఓ రేకుల షెడ్డును నిర్మించారు.
 
  ఈ షెడ్డులోనే అనాథ శవాలను మరణించిన రోజు నుంచి వేస్తున్నారు. కొన్నిసార్లు ఇక్కడ గుట్టలుగా శవాలు పేరుకుపోయి..కుళ్లి, పురుగులు పట్టి  దుర్గంధం వెదజల్లుతుండటంతో ఇక్కడి సిబ్బంది వాటిని భరిస్తూనే విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ కొత్తగా రిమ్స్‌లోకి ప్రవేశించే రోగులు మాత్రం వాంతి చేసుకుంటున్నారు. మంగళవారం కూడా ఇదేవిధంగా దుర్గంధం రావడంతో రోగులు ‘సాక్షి’ దృష్టికి తెచ్చారు. ఆ రేకుల షెడ్డును తనిఖీ చేయగా దాదాపు 5 శవాలు అందులో ఉన్నాయి. శవాలన్నీ పూర్తిగా కుళ్లిపోయి..పురుగులుపట్టి ఉన్నాయి. ఆ ప్రదేశంలోకి వెళ్లాలంటేనే దుర్గంధం వెదజల్లుతోంది. ఈ మృతదేహాలు అక్కడ పడేసి పది రోజులపైనే అయినట్లు సమాచారం.
 
 కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం
 రిమ్స్‌లో అనాథ శవాలపై ఆర్‌ఎంవో నుంచి సమాచారం అందుకున్న మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది..శవాలను తరలించడానికి ఎప్పుడో ప్రభుత్వం నిర్దేశించిన రూ.300లు సరిపోక, వాహనం గానీ, సిబ్బంది కానీ లేకపోవడంతో ఎప్పుడో పది రోజుల కొకసారి తరలిస్తున్నారు. లేదంటే రిమ్స్ అధికారులే తమ సిబ్బందితో శవాలను ఖననం చేయిస్తున్నారు. అనాథ శవాలను పోలీసులు గుర్తించి తమకు సమాచారం అందిస్తే వాటిని తరలిస్తున్నామని, రిమ్స్ నుంచి తమకు సమాచారం లేదని కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
 
 రిమ్స్ అధికారుల అలసత్వం
 కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యంపై కమిషనర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా రిమ్స్ అధికారులు ప్రయత్నాలు చేయడంలేదు. అదే విధంగా ఉన్న మార్చురీ సరిపోవడంలేదని, మరో మార్చురీ నిర్మించడానికి ప్రతిపాదనలు లేదా ఉన్న మార్చురీ సామర్థ్యాన్ని పెంచడానికి గానీ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనాథ శవాలను ఎప్పటికప్పుడు తరలించాలని, శవాల వలన ఇతర వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
 
 కార్పొరేషన్ సిబ్బంది రావడం లేదు:
 డాక్టర్ బాలాజీ నాయక్, రిమ్స్ ఆర్‌ఎంవో
 అనాథ శవాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి పంపిస్తుంటాం. అయితే వారు తీసుకువెళ్లడం లేదు. మేమే సొంత నిధులతో శవాలను కొన్నిసార్లు ఖననం చేయిస్తున్నాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement