పాలమూరు, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి తిరుగు లేదని, హై కమాండ్ నిర్ణయించిన ప్రకారం రాష్ట్ర విభజన తప్పక జరిగి తీరుతుందని కేంద్ర, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రజాస్వామ్య విజయమన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో టీజేఏసీ ఆధ్వర్యంలో జైపాల్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలు సంఘటితంగా ఉద్యమించి అపూర్వ విజయం సాధించారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న తెలంగాణ వాదులు, ఆయా పార్టీల ప్రతినిధులు, జేఏసీ, ప్రజా సంఘాల ప్రతినిధులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నానన్నారు. తెలంగాణ-సీమాంధ్ర ఏ ప్రాంతం వారైనా ప్రజలను మాత్రం నిందించనని, సీమాంధ్ర ప్రాంత నాయకుల వైఖరి కారణంగానే అక్కడ సమస్య తలెత్తిందని, తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ప్రకారం సీమాంధ్ర నేతలు ఇలాంటి వాదనలు చేయడం సరికాదన్నారు. తాను కేంద్రంలో ఉన్న కారణంగానే తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను సందర్భోచితంగా చెప్పే అవకాశం దక్కిందన్నారు. నదీ జలాలకు సంబంధించి భయాందోళనలు తొలగించాలని, అమాంతంగా హైదరాబాద్‌ను వదిలి వెళ్లమని ఎవరూ చెప్పడం లేదని, ఉమ్మడి రాజధానిగా పదేళ్ల వరకు ఇక్కడే ఉండేందుకు అవకాశం కల్పించారన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ కార్యాచరణ రూపొందించిందన్నారు.
సీమాంధ్ర ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించడం వల్లే అర్థం లేని ఆందోళనలకు దిగుతున్నారని, ఎవరి వ్యాఖ్యలపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, సమస్యల పరిష్కారాన్ని కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందన్నారు. బాధ్యత కలిగిన కేబినెట్ మంత్రి స్థాయిలో ఉన్న తెలంగాణ వాడిగా తాను ఈ ప్రాంతం తరఫున మాట్లాడతానని తెలిపారు. రాష్ట్ర విభజనకు ఆర్టికల్-3 ప్రకారం ఎలాంటిచిక్కులు ఉండవని, పార్లమెంటులో ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చన్నారు. తాము తెలంగాణకు జిందాబాద్ అని మాత్రమే అంటున్నామని, సీమాంధ్రకు ముర్దాబాద్ చెప్పడం లేదని, అదీ మన ప్రాంత ప్రజల స్వభావమన్నారు.
అంతకు ముందు టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు శ్రీకారం చుట్టే పరిస్థితికి అందరూ కృషి చేశారని, విభజన ప్రకటన వెలువడినంత మాత్రాన సంతోషపడేది లేదని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితేనే నమ్మకం కుదురుతుందన్నారు. సీమాంధ్ర నేతలు చేస్తున్న ఒత్తిళ్లకు యూపీఏ హైదరాబాద్‌పై పేచీ పెడుతుందన్న అనుమానం వ్యక్తమవుతోందన్నారు.
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు పోరు చేసైనా హైదరాబాద్‌పై సమస్యల రాకుండా చూడాలని కోరారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 13 జిల్లాల ప్రతినిధిగా మాట్లాడటం శోచనీయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు భగవంతరావు, బాలవర్ధన్‌రెడ్డి, జేపీఎన్‌సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
నిర్ణయం జరిగిపోయింది విభజన తప్పదు
Published Sat, Aug 10 2013 3:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement