కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : విధుల్లో నిర్లక్ష్యంపై వేటు పడింది. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆస్పత్రిలోని లేబర్ రూంలో గతేడాది నవంబర్ 3న ఏగోలపు కావ్య ఉరఫ్ సుమతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మరణించిన ఘటనపై రాష్ట్ర వైద్య విధాన పరి షత్(ఏవీవీపీ) కమిషనర్ చర్యలు ప్రారంభించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలంది స్తున్న వైద్యుడు సంతోష్‌ను విధుల నుంచి తొలగించడంతోపాటు సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు, నర్సింగ్ సిబ్బంది నాన్సీ, పుష్ప, స్వాతికి చార్జ్ మెమోలు జారీచేశారు. యైటింక్లయిన్‌కాలనీ పరిధి అల్లూరుకు చెందిన స్వామి భార్య కావ్యను నవంబర్ 2న పురిటినొప్పులు వస్తే ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్పారు. మరుసటి రోజు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి... అందుబాటులో డాక్టర్ లేకపోవడంతో నర్సింగ్ సిబ్బందే పురుడు పోశారు.
ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన కావ్య తీవ్ర రక్తస్రావంతో అరగంటకు చనిపోయింది. ఘటనపై స్వామి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిషాలోని గ్లోబల్ హ్యుమన్ రైట్స్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. విచారణ చేయాలని హక్కుల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించడంతో విచారణ నిర్వహించారు. రెండు ప్రత్యేక బృందాలు విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాయి. వాటి ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనరేట్ నుంచి జారీ అయిన ఉత్తర్వు కాపీలను బుధవారం వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి పంపించినట్లు డీసీహెచ్‌ఎస్ అజ్మీరా భోజా తెలిపారు.
ఇదే సంఘటనపై ఇటీవల తాత్కాలిక ఏఎన్‌ఎం సువర్ణ, ఆశ వర్కర్ సుభద్రను సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్‌వో కొమురం బాబు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టారు. అయితే చార్జ్ మెమోలు అందుకున్న సూపరింటెండెంట్, ముగ్గురు నర్సింగ్ సిబ్బంది కమిషనరేట్‌కు కావ్య మృతిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరణకు కమిషనరేట్ నుంచి సంతృప్తి చెందకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అధికారుల చర్యలతో ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
డాక్టర్ డిస్మిస్
Published Thu, Feb 13 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement
Advertisement