పూడూరు, న్యూస్‌లైన్: వృద్ధ దంపతులను హత్య చేసి ముఖాలు గుర్తించకుండా దహనం చేసిన దారుణ సంఘటన పూడూరు మండలంలో శనివారం కలకలం రేపింది. ధారూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కల్కోడ అంజయ్య (70), లక్ష్మమ్మ(65) దంపతులు. పూడూరు మండలం ఎన్కెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మంగమ్మ (మంగేశ్వరి) ఫాంహౌస్‌లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. ఎప్పటి లాగే శుక్రవారం రాత్రి ఫాంహౌస్‌లో ట్రాక్టర్‌తో పనులు చేయించారు. శనివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వచ్చి చూసే సరికి ఇద్దరూ ఫాంహౌస్‌లోని వంట గదిలో కాలిబూడిదై కనిపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చన్గొముల్ పోలీసులతోపాటు చేవెళ్ల సీఐ గంగారం, ఎస్‌ఐ శేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ రాజకుమారి, చేవెళ్ల డీఎస్పీ శిల్పవల్లి, సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన ప్రదేశాన్ని, పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను పరిశీలించారు. వెంటనే క్లూస్ టీం, జాగిలాలను రంగంలోకి దింపారు. క్లూస్ టీం హత్య జరిగిన గదిలో ఆధారాలు సేకరించారు. జాగిలం ఫాంహౌస్ గదుల చుట్టూ తిరిగి నేరుగా రోడ్డుపైకి వెళ్లి ఆగిపోయింది. తల్లిదండ్రుల మృతదేహాలను చూసి కుమారులు వెంకటయ్య, ప్రభాకర్, కూతురు యాదమ్మ బోరున విలపించారు.
డబ్బు, నగల కోసమే ఘాతుకం.. ?
అంజయ్య, లక్ష్మమ్మ ఉండే ఇంటిపై కప్పు రేకులు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీన్ని బట్టి దుండగులు డబ్బులు, లేదంటే నగల కోసం వచ్చి ఉంటారని.. రేకులు పగులగొట్టి ఇంట్లో చొరబడి ఉంటారని.. వృద్ధ దంపతులు దుండగుల మధ్య తోపులాట జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సిమెంట్ ఇటుకలతో మోది చంపి ఆపై వంట గదిలోకి శవాలను తీసుకెళ్లి వంటిపై కిరోసిన్, లేదా పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు. ఇది తెలిసినవారి పనేనన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధ దంపతుల హత్య
Published Sun, Sep 8 2013 6:15 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
Advertisement
Advertisement