తొలిసారి ఎన్నికల భేరి | The election of the first drum | Sakshi
Sakshi News home page

తొలిసారి ఎన్నికల భేరి

Published Tue, Mar 4 2014 12:37 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

తొలిసారి ఎన్నికల భేరి - Sakshi

తొలిసారి ఎన్నికల భేరి

  • జిల్లాలో రెండు కొత్త మున్సిపాలిటీలలో మొదటిసారిగా బ్యాలెట్ యుద్ధం
  •  30న ఎన్నికలు, ఏప్రిల్ 2న ఫలితాలు
  •  అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
  •  యుద్ధభేరి ఆకస్మికంగా మోగింది... సమర శంఖారావం హఠాత్తుగా ప్రతిధ్వనించింది! కనుచూపు మేరలో కనిపిస్తున్న సార్వత్రిక కదనానికి సిద్ధం కావాలనుకుంటున్న రాజకీయ సేనలకు, పురపాలక వాతావ‘రణం’ ఎదురయ్యేసరికి ఉక్కిరిబిక్కిరయినంత పనయింది! నెలాఖరులో జరగనున్న మున్సిపల్ సమరం ఆసక్తికర వాతావరణానికి తెర తీయనుంది. జిల్లాలో ఉన్న అనకాపల్లి, భీమునిపట్నం మున్సిపాలిటీలు విశాఖ నగరపాలక సంస్థలో విలీనం కావడంతో.  కొత్తగా ఏర్పాటైన నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో పోలింగ్ సంగ్రామానికి రంగం సిద్ధమయింది. రెండేళ్ల క్రితమే ఏర్పాటైన ఈ రెండు మున్సిపాలిటీల్లో తొలిసారి పోరు జరగబోతోంది. సోమవారం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
     
     నర్సీపట్నం, న్యూస్‌లైన్ : రెండేళ్ల క్రితం మున్సిపల్ హోదా పొందిన రెండు మున్సిపాలిటీలకు ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల కళ వచ్చింది. రెండేళ్ల క్రితం ఏర్పాటైన నర్సీపట్నం, యలమంచిలిలకు మున్సిపాలిటీలుగా ప్రథమంగా ఎన్నికలు జరుగుతున్నాయి.

    ఈ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలకు చెందిన ప్రజలంతా మొదట మున్సిపాలిటీ వార్డు సభ్యులను నేరుగా ఎన్నుకుని, పరోక్ష పద్ధతిలో చైర్మన్‌ను ఎంపిక చేయనున్నారు.  నర్సీపట్నం, బలిఘట్టం, పెదబొడ్డేపల్లి పంచాయతీల కలయికతో నర్సీపట్న ం మున్సిపాలిటీ ఏర్పడింది. యలమంచిలి, సోమలింగపాలెం, రామారాయుడుపాలెం, పెదపల్లి, యర్రవరం-25, తెరువుపల్లి, కట్టుపాలెం, కొక్కిరాపల్లి పంచాయతీలతో యలమంచిలి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది.

    దీనికి సంబంధించి 2011 డిసెంబరులో జీవో విడుదల అయ్యింది. అప్పటివరకు ఈ మున్సిపాలిటీల్లో  విలీనమైన గ్రామ ప్రజలంతా గతంలో పంచాయతీ పాలకవర్గాలకు నిర్వహించే ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ గ్రామాలన్నింటినీ విలీనం చేసి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయడంతో  ప్రథమంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
     
    30న ఎన్నికలు
     
    ఈ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది.  నర్సీపట్నంలోని 27, యలమంచిలిలో 24 వార్డులకు ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 14 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 15న నామినేషన్ల పరిశీలన, 18 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు ఉప సంహరణ ఉంటుంది. అదేరోజు సాయంత్రం అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. 30న నిర్వహించిన ఎన్నికలకు ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
     
    పార్టీ గుర్తులతో పోటీచేసే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 2,500, ఓసీలకు రూ. 5వేలు డిపాజిట్ చేయాల్సి ఉంది. పోటీచేసే అభ్యర్థులు రూ. లక్ష వరకు ఖర్చుచేసే విధంగా షరతులు విధించింది. సోమవారం ఉదయం పది గంటలకు ప్రకటించిన షెడ్యూల్‌తో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
     
    ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను దించి, తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మున్సిపల్ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
     
     యలమంచిలిలో సందడి

     యలమంచిలి, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా మోగడంతో కొత్తగా ఏర్పడిన యలమంచిలి మున్సిపాలిటీ ఎన్నికల సందడి ప్రారంభమయింది. రెండేళ్లక్రితం వరకు మేజర్ పంచాయతీగా ఉన్న యలమంచిలి పట్టణంతోపాటు పెదపల్లి, కొక్కిరాపల్లి, గ్రామాలను విలీనం చేశారు.  దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో విలీన గ్రామాలకు చెందిన ఓటర్లు కీలకం కానున్నారు.

    ముఖ్యంగా  యల మంచిలి మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మున్సిపాలిటీలో 24వార్డుల్లో 32వేల 459 మంది ఓటర్లు ఉండగా పురుషులు 15వేల 612మంది, మహిళలు 16వేల847మంది ఉన్నారు. దాదాపు అన్ని వార్డుల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో కౌన్సిలర్ స్థానాల్లో కూడా మహిళలు ముఖ్య పాత్రను పోషించనున్నారు. 1,15వార్డులు మినహించి మిగిలిన 22వార్డుల్లో కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

    వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్యే ప్రధానపోటీ.. : మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, దేశంపార్టీల మధ్యనే ప్రధాన పోటీ జరగనుంది.  ఈ రెండు పార్టీల నేతలు వార్డులకు కౌన్సిలర్‌లు, చైర్మన్ అభ్యర్థుల వేట ప్రారంభించాయి.  కాంగ్రెస్‌పార్టీనుంచి వైఎస్సార్‌సీపీకి పెద్దయెత్తున వలసలు ఉండడంతో ఆపార్టీ తరపున పోటీ ఉండకపోవచ్చన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
     
     నర్సీపట్నంలో ఉత్సాహం

     నర్సీపట్నం, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగాయి. తాజాగా వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి.

    వైఎస్సార్‌సీపీ, టీడీపీలు వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై పట్టణంలోని ముఖ్య నాయకులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించాయి. వీటి ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడనున్న దృష్ట్యా మున్సిపాలిటీ లను చేజిక్కించుకునేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించాయి. నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి దీటైన అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement