సరదాగా కాసేపు..
రెండో రోజూ మధ్యాహ్నానికే ముగిసిన కాంగ్రెస్ మేధోమథనం
కబుర్లతోనే కాలక్షేపం..
100 మందికి పాస్‌లు తయారు చేస్తే వచ్చింది 40 మంది
కృష్ణా, గుంటూరు జిల్లాలోని కార్యకర్తలతో సమావేశం
ఆరు కమిటీలు కాదు.. ఒక్కదానితోనే సరి
సదస్సులో తీర్మానాలు కూడా ప్రకటించలేదు..
విజయవాడ : నగరంలో జరిగిన ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల మేధోమథన సదస్సు సరదా కబుర్లతోనే ముగిసింది. రాష్ర్ట ముఖ్య నాయకులు సదస్సుకు హాజరు కాలేదు. హాజరైన కొద్ది మంది మాత్రం ఎప్పటి మాదిరిగానే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాని నొక్కివక్కాణించారు. ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్ కూడా పార్టీ దుస్థితిని చూసి నివ్వెరపోయారు. ఆయన మొదటి రోజు సదస్సు ముగిసిన వెంటనే ఢిల్లీ వెళ్లిపోవాలని భావించారు. అయితే, సదస్సులో ఆయన కూడా లేకపోతే ఇక్కడి నేతలు ఎవరిదారిన వారు వెళ్తారని, పార్టీ పరువు పోతుందని నాయకులు దిగ్విజయ్‌ను ఉండాల్సిందిగా కోరారు. సదస్సును రెండో రోజైన శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముగించారు. సాయంత్రం కోటి సంతకాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా రామవరప్పాడు రింగ్ వద్ద కొందరి చేత సంతకాలు చేయించారు. అనంతరం అటు నుంచే దిగ్విజయ్ సింగ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు.
పార్టీ అనుకున్నదేమిటీ...
పార్టీలో ఉన్న రాష్ట్ర కో-ఆర్డినేటర్లు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సదస్సుకు తప్పకుండా హాజరయ్యేలా చూడాలని భావించారు. వీరి కోసం 100 పాస్‌లు తయారు చేయించారు. కాంగ్రెస్‌ను బలమైన శక్తిగా తిరిగి రాష్ట్రంలో చూసేందుకు మంచి చర్చలు జరగాలని నిర్ణయించారు.
జరిగిందేమిటీ..
వంద మంది నాయకులు రావాలని భావిస్తే 40 మందికి మించలేదు. పైగా సమావేశంలో పాల్గొనాల్సిన హేమాహేమీలు రాలేదు. చిరంజీవి వస్తారని అందరూ భావించారు. ఆయన రాలేదు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం సదస్సు ముగిసే సమయంలో కనిపించి వచ్చాననిపించారు. ఒక్కో అంశంపై కూలంకుషంగా చర్చించేందుకు ఆరు కమిటీలు ఏర్పాటుచేయాలని ముందుగా భావించారు. అయితే, ముఖ్యులు రాకపోవడంతో వచ్చిన వారందరితో ఒకే కమిటీ ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాల నివేదికను ఈ నెల 28వ తేదీన రాహుల్ గాంధీని కలిసి అందజేయాలని నిర్ణయించారు.
సదస్సు తీర్మానాలు ఎందుకు వెల్లడించలేదు?
మేధోమథన సదస్సులో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను తీర్మానాల రూపంలో విడుదల చేస్తామని ముందురోజు చెప్పారు. అయితే, సదస్సులో అనుకున్న విధంగా చర్చ జరగకపోవడంతో తీర్మాణాలు వెల్లడిస్తే పరువుపోతుందని ఆ ప్రయత్నం చేయలేదని తెలిసింది.
ఇంతకూ చర్చించినదేమిటీ..
రాష్ట్ర విభజన వల్ల పూర్తిగా నష్టపోయాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కాంగ్రెస్‌కు బాగా దూరమయ్యారు. వారిని తిరిగి పార్టీలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రారంభించిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర స్థాయిలో జరిగిన మొదటి మేధోమథన సదస్సు ఇది. ఈ సదస్సుకు దిగ్విజయ్ రావడం, రెండు రోజుల పాటు ఉండటం గమనార్హం. అయితే, ఈ సదస్సుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొందరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పిలిచినా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.