ఉన్నది లేనట్టు.. అంతా కనికట్టు
జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటంటూ హడావుడి
- భూసేకరణ కూడా సాధ్యం కాని పనే...
- కొత్త కలెక్టరేట్‌కే ఇప్పటి వరకు గతిలేదు
శ్రీకాకుళం పాతబ స్తాండ్ : ప్రభుత్వం ఊహల్లో విహరిస్తూ నిర్ణయూలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. జరగడానికి కనీసం అవకాశం లేనటువంటి అంశాలను కూడా జరుగుతాయని చెబుతూ అధికార పార్టీ నాయకులతో పాటు ఉన్నతాధికారులను కూడా తప్పుతోవ పట్టిస్తోంది. జిల్లాలో విమానాశ్రమం ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టరుకి సూచన ప్రాయంగా రాష్ట్ర ్రపభుత్వం సమాచారం అందించింది. అయితే ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రజల్లో మెప్పుకోసం అనవసర ప్రకటనలు చేస్తోన్నట్లు కనిపిస్తోంది.
జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే సుమారుగా ఒకే చోట 500 వందల ఎకరాల భూమి ఉండాలి. జిల్లాలో ఒకే చోట అంత భూమి ఎక్కడా అందుబాటులో లేదు. ఉండబోదు కూడా.. ఇటువంటి పరిస్థితుల్లో కొండలు గుట్టలు మినహ జిల్లాలో భూములు లేవు. జిల్లాకు చెందిన నాయకులు ఇంతవరకు అభివృద్ధి పథకాల కోసం ప్రస్తావించిన సందర్బం లేదు. ఇంతలోనే విమానాశ్రయం ఏర్పాటు విడ్డూరంగా ఉందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. జిల్లాలో హెలీపాడ్‌కు గతిలేదు, ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసింది తప్ప కొత్తగా లేదు, రాష్ట్ర విభజన తరువాత మరింతగా ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలు అమలుకి, రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసేందుకు సరిపడిన డబ్బులేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ లోటును భర్తి చేసుకొనేందుకుగాను వివిధ ఉద్యోగుల నుంచి సందాలు, ఎర్రచందనం అమ్మకం వంటివి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళంలో విమానాశ్రయం సాధ్యంకాని పని. ఇప్పటికే విజయనగరం జిల్లా బాడంగిలో బ్రిటీష్ కాలంలో విమానాశ్రయం. ఏర్పాటు చేశారు. రన్ వే కూడా ప్రస్తుతం ఉంది. అదే ఇప్పటివరకు అభివృద్దికి నోచుకోలేదు, ఇక కొత్తగా విమానశ్రయం ఏర్పాటు చేయడమంటే హాస్యాస్పదమే.గతంతో పలు ప్రభుత్వ ఆవసరాలకు చేపట్టిన భూసేకరణ పురిటి దశలోనే ఉంది.
కొత్తగా భూసేకణ సాధ్యమయ్యే పరిస్థితి కాదు. గతంతో ఉమ్మడి రాష్ర్టంలో నిధులు పుష్కలంగా ఉన్నప్పుడు ఏ అభివృద్ది పనులు చేయలేకపోయారు. పట్టణంలోని పేదలకు ఇళ్ల నిర్మాణానికి మూడో విడత భూసేకరణకు సుమారుగా 40 ఎకరాలు కావాల్సింది, అయితే అయిదేళ్లు గడిచినా ఇంతవరకు కనీసం 20 ఏకరాలు కూడా ఇంతవరకు సేకరణ ప్రభుత్వం అధికారులు చేయలేదు. దానికి భూ యజమానుల నుంచి వ్యతిరేకత, న్యాయపరమైన సమస్యలు, తదితర కారణాలు ఉన్నారు.
ప్రభుత్వ భూమి లేదు..
సమగ్ర కలెక్టరేట్‌ను నిర్మాణానికి మూడేళ్ల క్రితం ప్రణాళిక రూపొందించారు. అప్పుడు రూ. 50కోట్లతో నిర్మాణం చేయనున్నట్టు రాష్ర్ట ముఖ్య మంత్రి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఎక్కడ వేసిన గోంగళి అక్కడే ఉండిపోయింది. తీరా ఆ కలెక్టరేట్‌ను జాతీయ రహదారి సమీపంలో విజయాదిత్యా పార్కువద్ద నిర్మించాలని కొత్త ప్రతిపాదన కొత్త ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది సాధ్యంకాని పనిగానే ఉంది.
ఇక విమానాశ్రయం రణస్టలం, ఎచ్చెర్ల, గార మండలాల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు చెపుతున్నారు. అయితే ఈ మండలాల్లో సెంటు భూమి కూడా విమానాశ్రయంకి అనువుగా లేదని అక్కడ రెవిన్యూ, సర్వే అధికారులు చెపుతున్నారు. రణస్థలంతో ఇప్పటికే కొవ్వాడలో అణువిద్యుత్ కర్మాగారం కోసం సుమారుగా రెండు వేల ఎకరాలు భూసేకరణ దశలో ఉంది. అక్కడ ఉద్యమాలు తిరుగుబాట్లు జరుగుతున్నారు.
ఆ భూమి మినహా అక్కడ ప్రభుత్వ భూమి లేదు. ఇక ప్రవేటు భూమిని కొనుగోలు చేయాలంటే అర్బన్ హౌసింగ్ పరిస్థితి ఏర్పాడుతుంది. గార మండలం అంపోలు తదితర ప్రాంతాల్లో కూడా భూమి లేదు. అక్కడ అంతా లోతట్టు భూములు, జిరాయితీ భూములు. భూసేకరణ కూడా కష్టమే. మిగిలినది తీర ప్రాంతం అంత అనువుగా ఉండదు. ఎచ్చెర్ల మండలంలో కూడా అయిదు ఎకరాల భూమి లేదు, ఇక ఎచ్చెర్లమండలం కేంద్రంలో కొద్దిపాటి భూమలు ఉన్నప్పటికి అవి అంతా కొండలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అక్కడ కూడా సాధ్యమయ్యే పనికాదు.