సాక్షి ప్రతినిధి, కడప: హలో అటవీ అధికారే కదా..! నేను చంద్రమోహన్(పేరు మార్చాం)ను మాట్లాడుతున్నా. రాష్ట్ర స్థాయి మాజీ డెరైక్టర్‌ను. అదే.. మీరు రెడ్డినారాయణ, గుట్ట బాబులను అరెస్టు చేశారు కదా...అంతటితో సరిపెట్టండి... పీడీ యాక్టు అమలు చేయాలని ఉన్నట్లు తెలుస్తాంది. ఇంకేమి పెట్టొద్దులేండి.. నేను ముఖ్యనేత తమ్ముడు కు మీగురించి మంచిగా చెబుతాలే! సరేనా.. మీ కింది అధికారి వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడుతాడు.. ఇంకేమి అడ్డంకులు పెట్టొద్దు.. సరే ఉంటాను...
‘సిఫార్సులకు కాదేదీ అనర్హం’ అన్నట్లుగా జిల్లాలో అధికార పార్టీ నేతల శైలి కన్పిస్తోంది. ఆదాయం వస్తుందంటే ఎలాంటి సిఫార్సులైనా, ఎవరికైనా చెస్తుండడం పరిపాటి మారింది. తాజాగా ఎర్రచందనం ఘరానా స్మగ్లర్లుగా పేరుగాంచిన రెడ్డినారాయణ, గుట్టబాబుల వ్యవహారాన్ని అధికార పార్టీ నేతలు రక్తి కట్టిస్తున్నారు. అరెస్టు వరకూ సరే.. పీడీ యాక్టు అమలు చేయవద్దని పెద్ద ఎత్తున సిఫార్సులు వస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ముఖ్యనేత సోదరుడితో స్వయంగా చెప్పిస్తామని ఒక విధంగా బెదిరింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారు.
టీడీపీ మద్దతుదారుడైనప్పటికీ....
రెడ్డినారాయణ సంబేపల్లె మండల వాసి. స్థానికంగా టీడీపీ మద్దతుదారుడు. ఎవరూ లేకపోతే పోటీకి తానున్నానని ఓ సందర్భంలో ముందుకు వచ్చిన వ్యక్తి. ఎర్రచందనం అక్రమ రవాణాతో రెడ్డినారాయణ ఎదిగారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో చిత్తూరు జిల్లా టాస్క్‌పోర్స్ పోలీసులు రెడ్డినారాయణతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది.
గతంలో రెడ్డినారాయణపై పీడీ యాక్టు అమలు చేస్తే సుప్రీంకోర్టుకెళ్లి కొట్టివేయించుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉన్న నేర చరిత్ర కారణంగా ప్రస్తుతం పీడీ యాక్టు అమలు చేయాలనే తలంపులో అటవీ యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. ఈవిషయం ఫారెస్టు యంత్రాంగంలోని కొందరు సిబ్బంది ద్వారా బహిర్గతమైనట్లు సమాచారం. దీంతో అధికారపార్టీ నేతలు రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ మద్దతుదారుడైనా తమకు అదాయం దక్కితే చాలు అన్నట్లుగా అధికార పార్టీ నేతలు ఉన్నట్లు ఈవిషయం రుజువు చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
మంచి పోస్టింగ్ ఇప్పిస్తా! సహకరించు
రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ మాజీ డెరైక్టర్ ఒకరు రెడ్డినారాయణకు వత్తాసు పలుకుతున్నారు. సబ్‌డివిజన్ పరిధిలోని ఓ అధికారితో మంత్రాంగం నడిపారు. తనకు ముఖ్యనేతతోనూ, ఫారెస్టు యంత్రాంగంలో ఉన్నతస్థాయి అధికారులతోనూ ఉన్న పరిచయాలు మీకు తెలిసిందే. మీకు మంచి పోస్టింగ్ ఇప్పిస్తాను, ఈవ్యవహారంలో సహకరించాల్సిందిగా కోరినట్లు సమాచారం. అందుకు ప్రతిఫలం కూడా ఉంటుందని చెప్పడంతో ఆ అధికారి ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ఎక్కడ ‘కీ’ తిప్పాలో అక్కడ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆశాఖలో గుప్పుమంటోంది.
పీడీ యాక్టు అమలు ఆలోచనలో ఉన్నాం...డీఎఫ్‌ఓ నాగరాజు
ఎర్రచందనం స్మగ్లర్లు రెడ్డినారాయణ, గుట్టబాబుల నేర చరిత్ర కారణంగా వారిపై పీడీ యాక్టు అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గతంలో ఓమారు అమలు చేశాం. కోర్టు ఉత్తర్వుల కారణంగా విడుదల అయ్యారు. ఎలాంటి పైరవీలు నా వరకూ రాలేదు.
పీడీ.. వద్దులెండి
Published Sat, Dec 14 2013 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement