రాజానగరం : జిల్లాలో మెట్ట ప్రాంత పొలాలకు గోదావరి నీటిని అందించి, సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో గండి పడుతోంది.
రాజానగరం : జిల్లాలో మెట్ట ప్రాంత పొలాలకు గోదావరి నీటిని అందించి, సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో గండి పడుతోంది. ఏడు మండలాల్లో వేలాది ఎకరాలకు నీరందించాల్సిన చాగల్నాడు ఎత్తిపోతల పథకం ఏనాడూ లక్ష్యం మేరకు ఉపయోగపడలేదు. ఏటా ఖరీఫ్‌లో మాత్రమే నీరిచ్చే పథకం ఆ సీజన్ అవసరాలనైనా సకాలంలో తీర్చిన దాఖలా లేదు. రైతులు ఎలాగోలా తంటాలు పడి నారుమడులు పోసుకుని, నాట్లు వేసుకున్నాక చేలు మూనతిరిగే దశలో మాత్రమే పథకం నుంచి నీరు అందుతోం ది. అంతేకాదు.. 2002లో ప్రారంభమైన నా టి నుంచి ఇప్పటి వరకూ నిర్దేశించిన ఏడు మండలాల్లో మూడింటికి ఒక్క ఎకరానికీ నీరివ్వలేదు.
దీన్ని నమ్ముకుని నాట్లు వేసి నష్టపోయే కన్నా.. బీడుగా విడిచిపెడితేనే మేలని రైతులు అనుకునే పరిస్థితి దాపురించింది. పథకంలోని మూడు పంప్‌హౌస్‌లలో మోటార్లు ఎన్నడో పాడవగా గతంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. ఎన్నికల సమయంలో పథకానికి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తామని, పాడైన మోటార్ల స్థానే కొత్తవి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు దాని గురించి నోరు మెదపడం లేదు.
చాగల్నాడు పథకంలో కాతేరు, కోలమూరు, పాలచర్లలలో పంప్‌హౌస్‌లున్నారుు. గోదావరి నుంచి నీటిని సుమారు 48 మీటర్ల ఎత్తుకు ఈ మూడు పంప్‌హౌస్‌ల నుంచి అంచెలంచెలుగా ఎత్తిపోస్తూ ప్రధాన కాలువకు సరఫరా చేస్తుంటారు. ఒక్కో పంప్‌హౌస్‌లో మూడు చొప్పున మూడింటిలో తొమ్మిది మోటార్లు ఏర్పాటుచేశారు. ప్రతి పంప్‌హౌస్‌లో రెండు మోటార్లతో నీటిని తోడుతూ, ఒక మోటార్‌ను అట్టి పెడతారు. గతంలో తొమ్మిది మోటార్లూ పాడవగా ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రాజానగరం తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి రాజానగరం నుంచి మూడో పంప్‌హౌస్ ఉన్న పాలచర్ల వరకు పాదయాత్ర చేశారు. దాంతో ఒక్కో పంప్ హౌస్‌లో ఒక్కో మోటారుకు అరకొర మరమ్మతులు చేసి, గత రెండేళ్లుగా తూతూమంత్రంగా పథకాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పెందుర్తి అధికారపక్షం ఎమ్మెల్యేగానే కాక శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. పాడైన మోటార్ల స్థానే కొత్తవి ఏర్పాటు చేరుుంచాల్సిన బాధ్య త ఆయనపై ఉందని రైతులంటున్నారు.
ఇదీ ఆయకట్టు..
ఈ ఎత్తిపోతలతో చాగల్నాడు ప్రాంతంలోని రాజమండ్రి రూరల్ మండలంలో 1,151, కోరుకొండలో 1,666, రాజానగరంలో 8,875, రంగంపేటలో 13,548, బిక్కవోలులో 4,975, అనపర్తిలో 2,439, మండపేటలో 1,654 ఎకరాల కు నీటిని అందించవలసి ఉంది. కానీ రాజమండ్రి రూరల్‌లో 200, కోరుకొండలో 300, రాజానగరంలో ఏడు వేలు, రంగంపేటలో 2,500 ఎకరాలకు మాత్రమే అందిచగలుగుతున్నారు. ఈ ఏడాది అది కూడా జరగలేదు. బిక్కవోలు, అనపర్తి, మండపేట మండలాల్లో పిల్లకాలువలను ఏర్పాటు చేసినా వాటిలోకి ఏనాడు నీరు వచ్చిన జాడ లేదు.
సిబ్బందీ అంతంత మాత్రమే..
ఈ పథకం సమర్థంగా అమలు జరగకపోవడానికి సిబ్బంది కొరత కూడా ఒక కారణం. పథకం ప్రారంభంలో 58 సిబ్బంది ఉండగా ప్రస్తుతం 10 మందే పనిచేస్తున్నారు. మిగి లిన వారిని ఇతర పథకాలకు బదలాయిం చారు. సంబంధిత ఇంజనీర్‌ను దీనిపై వివర ణ కోరగా సిబ్బంది లేకపోవడమే మో టా ర్లు త్వరగా పాడవడానికి ప్రధాన కారణమన్నారు. ప్రస్తుతం ఈ పథకానికి ఏవిధమైన నిధులూ మంజూరు కాలేదని, సింగిల్ మో టార్లతోనే ఖరీఫ్‌కి నీళ్లు ఇస్తామని చెప్పారు.