
ప్రభుత్వం దిగొచ్చే వరకు తగ్గేది లేదు
అనంతపురం రూరల్ : జీవో నంబర్ 107ను రద్దు చేయకపోతే సమ్మె ఉధృతం చేస్తామని జూడాలు స్పష్టం చేశారు. బుధవారం మెడికల్ కళాశాల నుంచి వైద్యులు, మెడికోలు ర్యాలీగా సప్తగిరి సర్కిల్‌కు బయలుదేరారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఉయ్ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు. తాము ఖైదీలం కాదని.. బానిసల్లా చూడొద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ర్యాలీగా క్లాక్‌టవర్ వద్దకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అసోసియేషన్ నేతలు డాక్టర్ సుదీప్, నీహారిక, సత్తీష్, నందిత మాట్లాడుతూ ప్రభుత్వం తమను లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 2010 నుంచి తాము జీవోను రద్దు చేయమని కోరుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడానికి సిద్ధమేనని, అయితే మౌలిక సదుపాయాలు, శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నెలలు గడుస్తున్నా వేతనాలివ్వకుండా జాప్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిగిరాకపోతే అత్యవసర సేవల్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు కుష్బు, సౌమ్య, సులోచన పాల్గొన్నారు.
జూడాల సమస్యలు తీర్చాలి
అనంతపురం టవర్‌క్లాక్ : జూనియర్ డాక్టర్ల న్యాయమైన కోర్కెలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నరేష్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జాడాలకు సంఘీభావాన్ని ప్రకటించారు.