తీపి కబురు అందేనా..!
♦ చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణపై ప్రభుత్వం తర్జన భర్జన
♦ ప్రైవేటు రంగంలోనా.. సహకార రంగంలోనా..
♦ భరద్వాజ్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలేనా
♦ ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు, కార్మికుల ఎదురుచూపు
చెన్నూరు : సహకార చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం బ్యాంకులకు తనఖా పెట్టే ఆలోచనలో పడింది. రాష్ట్రంలోని 10 చక్కెర ఫ్యాక్టరీల్లో ఏటికొప్పాక, చోడవరం మినహా నష్టాల్లో ఉన్న 8 చక్కెర ఫ్యాక్టరీలను సహకార రంగంలో నడపడం సాధ్యమవ్వదని నిపుణుల కమిటీలు చెబుతున్నాయి. అయినా ప్రైవేటుకు అప్పగిస్తే రైతులు, కార్మికులతో పాటు ప్రజల్లో తమకు చెడ్డపేరొస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటుకిస్తే ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారేమోననే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
లక్షలాది రూపాయలు వెచ్చించి గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ర్ట్రంలోని అన్ని సహకార చక్కెర ఫ్యాక్టరీలలో భరద్వాజ కమిటీ అధ్యయనం చేసింది. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి ఫిబ్రవరి 24న భరద్వాజ్ కమిటీ రాగా కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి సహకార రంగంలోనే ఈ ఫ్యాక్టరీని నడపాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, కార్మికులు, రైతుల అభిప్రాయాల ప్రకారం సహకార రంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చక్కెర ఫ్యాక్టరీలను నడపడం చాలా కష్టం అని వారు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
అయినా ఈ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులే అంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలన్నింటిని కష్టమైనా సహకార రంగంలోనే నడపాలనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నేడు ఖాజీపేటకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులు, కార్మికుల శేయస్సును దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ఏకైక ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తనఖాపెట్టి నిధులను సమీకరిస్తే...
సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీ భూములు, యంత్రాలను ఆస్తులను బ్యాంకులకు ప్రభుత్వ గ్యారెంటీతో తనఖా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం విధుల్లో ఉన్న కార్మికుల వేతనాలు, ఇవ్వాల్సిన అరియర్స్‌తో పాటు చెరకు సాగు, యంత్రాల మరమ్మతులకు సుమారు రూ.150 కోట్ల మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం పొందాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో గతనెల 25న హైదరాబాద్‌లో చక్కెర పరిశ్రమలశాఖ కమిషనర్, సంబంధిత మంత్రి, సహకార చక్కెర ఫ్యాక్టరీల ఎండీలు, కార్మిక నేతలు, భరద్వాజ్ కమిటీతో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.
మళ్లీ ఎప్పుడు జరుపుతారనేది తేదీని అధికారులు ప్రకటించలేదు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి నేడు జరిగే జన్మభూమి సభలో వెల్లడిస్తారని చర్చలు జరుగుతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీనాయకులు ఫ్యాక్టరీకి అనుకూలంగా సీఎంచే స్పష్టమైన ప్రకటన చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఫ్యాక్టరీ ఏ రంగంలో తెరిచినా 2012 మార్చి నుంచి తమకు రావాల్సిన వేతనాలు, పదవీ విరమణ పొందిన కార్మికులకు, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన అరియర్స్ ఇవ్వాలని కార్మిక నేతలు కోరుతున్నారు.