
లక్ష ఎకరాలు బిల్లీరావు, ఎమ్మార్ కోసమేనా?
మండిపడ్డ మాజీ ఎంపీ, రైతు నేత యలమంచిలి శివాజీ
విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంపై స్పష్టతలేని ప్రభుత్వం లక్ష ఎకరాలు సేకరించి బిల్లీరావు, ఎమ్మార్‌లకు కట్టబెడుతుందా? పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? అంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నేత యలమంచిలి శివాజీ మండిపడ్డారు. జాతీయ భూ సేకరణ చట్టం- రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్, నియమ నిబంధనలపై భూమి ఉపాధి హక్కుల వేదిక, దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ... రాజధాని పేరుతో వ్యాపారం చేయాలనుకునే కొందరు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు మేల్కొనకపోతే రాజధాని నిర్మాణం మాటున భూ స్కామ్‌లకు అవకాశం ఇచ్చిన కళంకితుడవుతారని హెచ్చరించారు.ప్రైవేటు భూములను లాక్కుని రాజధాని నిర్మిస్తామని చెప్పడం సరికాదన్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 23వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, రాజధానిని వాటిలో నిర్మించుకోవచ్చని సూచించారు.
హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్ 22ఎకరాల్లో ఉందని, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం 20 ఎకరాల్లో ఉందని ప్రస్తావించారు. ఈ లెక్కన చూస్తే రాజధానికి లక్షల ఎకరాలు అవసరంలేదనే విషయం అవగతమవుతుందన్నారు. రాజధానికి 5 వేల నుంచి 10 వేల ఎకరాలు అవసరమని, తొలిదశలో 1,500 ఎకరాలు కావాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిందని శివాజీ గుర్తు చేశారు.ప్రైవేటు భూములే కావాలనుకుంటే మంత్రులు, ఎంపీలు, వారి బంధువులు ఇక్కడ కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను తొలుత సేకరించాలని డిమాండ్ చేశారు.