నవంబర్ 29.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమైన రోజు. రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహార దీక్షకు వెళ్లిన రోజది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఉద్యమం విస్తరింపజేసిన రోజది. పార్టీల భేదం లేకుండా తెలంగాణ జెండా అనే ఏకైక అజెండాతో ఉద్యమబాట పట్టించిన స్ఫూర్తిదాయక రోజది. దారిలోనే కేసీఆర్ అరెస్టుతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి ఘటనలను ఓసారి మననం చేసుకుందాం..
- న్యూస్‌లైన్, కరీంనగర్
కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక అజెండాగా 2001లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి 2009 ఎన్నికల్లో మహాకూటమితో జట్టు కట్టింది. కూటమిని తిరస్కరించడంతో టీఆర్‌ఎస్ చావుదెబ్బ తింది. తెలంగాణ అంతటా పట్టుమని పది సీట్లు కూడా రాలేదు. ఎన్నికల్లో పరాజయం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో టీఆర్‌ఎస్ ఉనికికే ప్రమాదం తెచ్చింది. కొద్దిరోజులకే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాదంలో మరణించడం... రోశయ్య సీఎం కావడంతో తెలంగాణ రాష్ట్రసాధన పోరాటం మళ్లీ మొదలైంది.
కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ నాయకులు మేథోమథనం చేశారు. మేథోమథనం నుంచి పుట్టిందే ఆమరణ నిరాహారదీక్ష ఆలోచన. తాను ఆమర ణ దీక్ష చేపడుతున్నట్లు 2009 నవంబర్ 6న కేసీఆర్ సంచలనాత్మక ప్రకటన చేశారు. ‘ఇది చివరి పోరాటం... కేసీఆర్ శవయాత్రలో పాల్గొంటా రో... తెలంగాణ జైత్రయాత్రలో పాల్గొంటారో తేల్చుకోండి’ అంటూ ప్రకటించారు. దీక్ష కోసం యూనివర్సిటీల విద్యార్థులను సన్నద్ధులను చేయడం, దీక్ష భగ్నం చేస్తే చేపట్టాల్సిన ఆందోళనలపై కార్యాచరణ రూపొందించడంతో వాతావరణం వేడెక్కింది. 29న సిద్దిపేటలో ఆమరణదీక్ష చేపడుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
కరీంనగర్ నుంచే పయనం
దీక్షకు ముందు వ్యూహరచన, మానసిక సన్నద్ధం కోసం కేసీఆర్ 26న కరీంనగర్‌కు రాగా, దీక్ష ను అడ్డుకునేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించడంతోపాటు తెలంగాణభవన్ వద్ద భారీ గా మోహరించారు. 28న అర్ధరాత్రి 12 గంటల కు పోలీసులు భవన్‌ను చుట్టుముట్టడంతో కేసీఆర్‌ను గృహ నిర్బంధంలో ఉంచబోతున్నారం టూ మీడియాలో ప్రచారం హోరెత్తింది. పోలీసు ల ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో చేరుకుని ఉత్కంఠ మధ్య తెల్లవార్లు ధూంధాం నిర్వహించారు.
నాటకీయంగా అరెస్టు
ఉత్కంఠ పరిస్థితుల మధ్య 29న ఉదయం 7.30కు టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాం తరావుతో కలిసి కేసీఆర్ సిద్దిపేటకు బయలుదేరారు. భవన్‌లో కాకుండా మార్గమధ్యంలో అల్గునూరు బ్రిడ్జి వద్ద చౌరస్తాలో అరెస్ట్ చేయాలనే పక్కావ్యూహంతో ఉన్న పోలీసులు కేసీఆర్ ను వెంబడించారు. కేసీఆర్ కాన్వాయ్‌ను మీడి యా సహాఎవరూ అనుసరించకుండా బ్రిడ్జి వద్ద నిలిపివేశారు. ఎమ్మెల్యేల వాహనాలనూ అనుమతించలేదు. నాటకీయ పరిణామాల మధ్య అల్గునూరు చౌరస్తా వద్ద కేసీఆర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు నిరసనగా ఆయన రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆయనను వరంగల్ మీదుగా ఖమ్మం తరలించారు. మెజి స్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించడంతో ఖమ్మం జైలుకు తరలించగా... జైలులోనే ఆయ న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
భగ్గుమన్న తెలంగాణ
కేసీఆర్ అరెస్ట్‌తో తెలంగాణ భగ్గుమంది. విద్యార్థులు వేలసంఖ్యలో రోడ్డెక్కారు. ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకాంతాచారి అనే యువకు డు నిప్పంటించుకుని ఆత్మత్యాగం చేసుకున్నా డు. రాస్తారోకోలు, ధర్నాలు, విధ్వంసాలతో తెలంగాణ అట్టుడికిపోయింది. గతంలో కేసీఆర్ తో విభేదించిన వారంతా ఆయనకు బాసటగా నిలిచారు.
ఆమరణదీక్షకు పార్టీలు, వర్గాలకతీ తంగా సంఘీభావం వెల్లువెత్తింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఖమ్మం ఆస్పత్రికి తరలించగా... రెండ్రోజుల్లోనే ఆస్పత్రిలో కేసీఆర్ దీక్ష విరమించినట్లు మీడియాలో రావడంతో ఉద్యమకారులు తిరగబడ్డారు. విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. తాను దీక్ష విరమించలేదంటూ ప్రాణం పోయేంతవరకూ దీక్ష కొనసాగిస్తానని కేసీఆర్ ప్రతిజ్ఞ చేయడంతో ఉద్యమం మరింత వేడెక్కింది. ఆయనను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా, రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. పార్లమెంట్‌లో బీజేపీ సభ్యులు కేసీఆర్ దీక్ష ప్రస్తావన తీసుకువచ్చారు.
డిసెంబర్ 9న ప్రకటన
కేసీఆర్ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం డిసెంబర్ 9, 2009 అర్ధరాత్రి ప్రకటన చేశారు. తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. కేసీఆర్ దీక్ష విరమించారు. సీమాంధ్ర ఉద్యమంతో అదే నెల 23న శ్రీకృష్ణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం మాట తప్పడంపై తెలంగాణ మండిపడింది. ప్రజాప్రతినిధులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఉద్యమం సాగుతూనే ఉంది.
చారిత్రక ఘట్టానికి నేటితో నాలుగేళ్లు
Published Fri, Nov 29 2013 3:19 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement