
ఇంటి దొంగ పనే.. ?
పట్టణంలోని ఏలూరు రోడ్డులో కొద్దిరోజుల కిందట జరిగిన రూ.11 లక్షల దొంగతనం కేసులో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచా రం.
- గుడివాడలో రూ.11 లక్షల చోరీ ఘటన వెనుక సెక్యూరిటీ గార్డు హస్తం?
- సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా కూపీ లాగిన పోలీసులు
- నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు
గుడివాడ : పట్టణంలోని ఏలూరు రోడ్డులో కొద్దిరోజుల కిందట జరిగిన రూ.11 లక్షల దొంగతనం కేసులో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచా రం. సెల్‌ఫోన్ కాల్స్ జాబితాల ఆధారంగా సీసీఎస్ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో గణనీయ పు రోగతి సాధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీఎంఎస్ వాహనంలో బాధితుడు రాంప్రసాద్ వెంట వచ్చిన సెక్యూరిటీ గార్డుపైనే పోలీసులకు అనుమానం ఉన్నట్లు తెలిసింది. ఆ దిశగా పోలీ సులు విచారణ చేస్తున్నారు. గార్డు బంధువులే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై గుడివాడ డీఎస్పీ నేతృత్వంలో రెండురోజులుగా దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఇతర జిల్లాలకు చెందిన దొంగల పనేనని పోలీసులు ముందుగా భావించారు. అయితే దొంగతనం జరిగిన తీరు.. సెక్యూరిటీ సిబ్బంది ఉండి కూడా కనీసం పట్టించుకోకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
సీఎం ఎస్ కస్టోడియన్ లక్కరాజు రాంప్రసాద్ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఆగంతకులు కూడా రావడంతో దీని వెనుక ఇంటిదొంగల హస్తం ఉందా? అని పోలీసులు అనుమానించారు. రాంప్రసాద్ వెంట ఉండే సిబ్బందిలో ఒకరు ఆయన కదలికలను ఎప్పటికప్పుడు నిందితులకు తెలియజేసి ఉంటారని భావిస్తున్నారు. దీంతో ఆయన ఇంటికి వచ్చిన వెంటనే దుండగులు కూడా వచ్చి కళ్లలో కారం చల్లి దొంగతనానికి పాల్పడగలిగారని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుల కోసం గాలింపు ముమ్మరం
డీఎస్పీ నేతృత్వంలో కేసు దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
సెల్‌ఫోన్ కాల్స్ లిస్టే పట్టించిందా?
ఈ కేసుకు సంబంధించి ఏలూరు రోడ్డులోని బ్యాంకుల వెలుపల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసు అధికారులు ముందుగా పరిశీలించారు. అయితే వాటిలో దృశ్యాలు స్పష్టంగా లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ల పరిధిలో పనిచేసిన సెల్‌ఫోన్ల జాబితాలను సేకరించారు. ఘటన జరి గిన సమయానికి ముందు రాంప్రసాద్ వద్ద పనిచేస్తున్న వారికి ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో సెక్యూరిటీ గార్డు, డ్రైవర్ సెల్‌ఫోన్ల కాల్స్ లిస్టును పరిశీలించారు. రాంప్రసాద్ వద్ద పనిచేస్తున్న గార్డుకు నిందితులు పదేపదే కాల్స్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని తెలిసింది. దీంతో అతడి బంధువులే చోరీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారని సమాచారం. నిందితులు ఎవరనేది కూడా పోలీసుల వద్ద సమగ్ర సమాచారం ఉన్నట్లు తెలిసింది.