రాష్ట్రంలో అసమర్థత పాలన
కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో అసమర్థత పాలన కొనసాగుతోందని, రాష్ట్ర విభజన హామీలను సాధించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం చెందారని డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య ఆరోపించారు. బుధవారం స్థానిక కళావెంకట్రావు భవనంలో ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు, కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు విభజన హామీలు నెరవే ర్చాలని కోరుతూ కోటి సంతకాలతో ఈనెల 12న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారంలో కోట్లు చేతులు మారి బహిరంగంగా దొరికిపోయినందునే బాబు బీజేపీ ప్రభుత్వం ఎదుట నోరెత్తడం లేదన్నారు. టీడీపీ నాయకులు రాజధాని ప్రాంతంలో భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ డబ్బుతోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొని ప్రజాస్వామ్య విలువలను మంటకలిపారని తెలిపారు.