పట్టా పాస్‌పుస్తకాలతో ఆధార్ సీడింగ్!
రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సీసీఎల్ఏ అధికారుల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలకు కళ్లెం వేయాలని సర్కారు నిర్ణయించింది. వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ పట్టాదారుకు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ మేరకు అన్ని జిల్లాల్లోనూ భూములు కలిగిన యజమానుల వద్ద ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఆధార్ నంబరును అనుసంధానం చేసేందుకు సీసీఎల్ఏ అధికారులు సన్నద్ధమయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు కోసం జాతీయ సమాచార కేంద్రం(ఎన్ఐసీ) అధికారులతో కలసి కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా.. పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఏ రైతుకు ఏ ప్రాంతంలో ఎంత భూమి ఉందన్న మొత్తం సమాచారాన్ని ఇట్టే తెలుసుకునేందుకు వీలు కలుగనుంది. అలాగే.. రైతులు కూడా సర్కారు రికార్డుల్లో తమ భూముల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకునేందుకు వెసులుబాటు కలగనుంది.
వారి భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఇతరులెవరైనా అక్రమంగా పేర్లు మార్చడం, ఒకరి భూములను వేరొకరి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడం.. వంటి అవకతవకలను నివారించేందుకు ఆధార్ అనుసంధానం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే వివిధ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు కూడా ఈ విధానం ఉపకరిస్తుందని, తరచుగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు, సిబ్బంది పెద్దగా హైరానా పడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.