బూడికి వైఎస్సార్ సీపీ ‘ముత్యాలు’ హారం
- వార్డుమెంబరు నుంచి ఎమ్మెల్యే స్థాయికి
- డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక
దేవరాపల్లి: మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడికి అరుదైన అవకాశం లభించింది. వైఎస్సార్‌సీపీ తరపున రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించే అవకాశాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి కల్పించారు. వార్డు మెంబరుగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా మాడుగుల ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు.
దేవరాపల్లి మండలం తారువ గ్రామానికి చెందిన ముత్యాలునాయుడు అనేక రైతు ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ఈయన తండ్రి వెంకునాయడు 35ఏళ్లపాటు తారువ గ్రామం సర్పంచ్‌గా సేవలందించారు. అప్పుడే వార్డు మెంబరుగా కూడా వ్యవహరించారు. ఆయన వారసుడిగా 1984లో దేవరాపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పార్టీ బాధ్యతలు చేపట్టారు. 1995 లో తారువా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
2001లో దేవరాపల్లి ఎంపీపీగా ఎన్నికయి మాడుగుల నియోజకవర్గంలో ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. మారిన రాజకీయ పరిణామాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. మాడుగుల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయ కర్తగా బాధ్యతలు చేపట్టారు.
ఆపార్టీ తరపు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీ తరపున డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక చేసి తమ ప్రాంతానికి గుర్తింపు నిచ్చిన జగన్‌మోహనరెడ్డికి మాడుగుల నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.