- పోలీసులు బైండోవర్ కేసులు పెట్టారు
- మావోయిస్టులు ప్రాణాలు తీశారు
- మాజీ మావోయిస్టు కమాండర్ కవిత ఆవేదన
ఒకవైపు పోలీసులు మరోవైపు మావోయిస్టుల మధ్య నలిగిపోతున్నామని మాజీ మావోయిస్టు కమాండర్ కొర్ర కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కవిత పెద్దనాన్న కొడుకు నరేశ్. ఇతడిని మావోయిస్టులు శుక్రవారం రాత్రి చంపేశారు. మావోయిస్టులకు సహకరిస్తున్నామని పోలీసులు బైండోవర్ పెడితే ఏకంగా మావోయిస్టులు... పోలీసులకు అనుకూలంగా ఉన్నామని చంపేశారని ఆవేదన చెందారు.
కొయ్యూరు: యూ.చీడిపాలెం పంచాయతీలో ఎండకోటకు చెందిన కవిత 2000లో మావోయిస్టుల్లో చేరారు. దళ సభ్యురాలి నుంచి 2006 నాటికి గుర్తేడు లోకల్ గెరిల్లా స్క్వాడ్ (ఎల్‌జీఎస్) కమాండర్ వరకు ఎదిగారు. దళంలో ఉండగానే ప్రస్తుతం జైలులో ఉన్న చడ్డా భూషణం అలియస్ నాగరాజును వివాహం చేసుకున్నారు.
ఆమె 2007లో కాకినాడలో అప్పటి ఎస్‌పీ ముందు లొంగిపోయారు. ఈమెకు రూ. ఐదు లక్షల రివార్డు వచ్చినా తీసుకోలేదు. నాటి నుంచి ఎండకోటలో సీహెచ్‌డబ్ల్యూగా పనిచేస్తున్నారు. బతికేందుకు వేరే మార్గం లేకపోవడంతో ఎండకోట మినీ అంగన్వాడీ వర్కర్‌గా దరఖాస్తు చేస్తే ఆ పోస్టు ఇటీవల ఆమెకు ఇచ్చారు. అయితే మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉందని భావించిన ఆమె వై.రామవరంలో ఉండిపోయారు.
నరేశ్‌ను చంపడంతో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. మా కుటుంబంలో ఎవరికీ పోలీసులతో సంబంధాలు లేవని చెప్పారు. అయినా మావోయిస్టులు కొందరు చెప్పిన తప్పుడు మాటలు విని తమను అపార్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పోలీసులకు సమాచారం ఇస్తున్నామన్న అనుమానంతో ఉన్నారన్నారు. వాస్తవానికి పోలీసుల కారణంగా తమ కుటుంబం ఇబ్బందులు పడుతోందన్నారు.
ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో వై.రామవరం పోలీసులు తనతోపాటు పెదనాన్న అప్పారావు, ఇప్పుడు చనిపోయిన నరేశ్‌పై బైండోవర్ కేసు పెట్టారన్నారు. ఎక్కడ ఏమి జరిగినా బాధ్యత మాదేనంటూ హెచ్చరించారన్నారు. తమను అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నించి ఆగిపోయారన్నారు.