పోలీసులు మరింత బాధ్యతతో పని చేస్తే ప్రజాదరణ పొందడం సులభమని భావించిన జిల్లా ఎస్పీ నవీన్ గులాఠి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. విధి నిర్వహణలో నిత్యం బిజీబిజీగా గడిపే పోలీసు అధికారులు ప్రజల హక్కులపై మరింత అవగాహనతో మెలిగేలా ప్రజా సంఘాల నేతలతో సూచనలు ఇప్పిస్తున్నారు. ఇందులో భాగంగా రెండవ విడతలో జిల్లాలోని (జిల్లాలో 66 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి) 22 పోలీస్‌స్టేషన్ల నుంచి 66 మందికి ఆరు రోజుల శిక్షణ నిర్వహించారు. లోతైన పరిశోధన, అట్టడుగు వర్గాల వారికి చేయూత, ప్రతిదానికి ‘లాఠీ’ పరిష్కారం కాదని చెప్పడం, సినిమాల ప్రభావం, సంచలనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడిని అధిగమించడం తదితర అంశాలపై సాగిన శిక్షణ బుధవారం ముగిసింది.
‘సీతయ్య ఎవ్వరి మాట వినడు. సమాజంలో రౌడీ ఒక్కడే ఉండాలి, వాడు పోలీసోడై ఉండాలి’. ఇవి సినిమా డైలాగులు. పోలీసు అధికారి బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యానికి బద్ధుడై, విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ చట్టానికి లోబడి నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఖాకీ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చట్టానికి లోబడి పనిచేయాల్సిన ఆవశ్యకతకు ఎస్పీ నవీన్‌గులాఠి గుర్తించారు. ఆమేరకు ఖాకీలకు హక్కుల పాఠాలు వివరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప: పోలీసులు బూతుపురాణాలు అందుకొని, లాఠీలకు పనిచెప్పడం సర్వసాధారణం. వారు చెప్పిందే వేదంగా, సూచించిందే శాసనంగా చాలా మంది వ్యవహరిస్తున్నారు. ఇది ఏమాత్రం సరైంది కాదని ప్రజల హక్కుల్ని పరిరక్షించాల్సిందేని జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠి నిర్ణయించారు. ఆ మేరకు హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నేతలతోపాటు, సీనియర్ పోలీసు అధికారులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. పలు సమస్యలతో స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి.. చట్ట ప్రకారం పోలీసులు ఎలా నడుచుకోవాలి. ప్రజల హక్కులను ఉల్లంఘించకుండా మసలుకోవడం ఎలా? కేసుల పరిశోధన ఎలా చేయాలి.
అనే విషయాలను సమగ్రంగా వివరిస్తున్నారు. పోలీసు అధికారికి పరిశోధనలో చెవులు కళ్లు మాత్రమే పనిచేయాలని, చేతులు జేబులో ఉండాలని సీనియర్ అధికారులు ఉదాహరణలతో వివరించారు. ప్రజాహక్కుల ఉల్లంఘన, అట్టడుగు వర్గాలకు చేయూత నివ్వడంపై మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్, న్యాయవాది కె. జయశ్రీ, అంబేద్కర్ మిషన్ కార్యదర్శి, న్యాయవాది సంపత్‌కుమార్ తదితరులను తరగతులకు ఆహ్వానించి పోలీసు అధికారులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. రెండోపర్యాయం నిర్వహించిన ఈ శిక్షణా తరగతులు బుధవారంతో ముగిశాయి.
ప్రజల్లో గౌరవాన్ని పెంపొందించుకోవాలి..
ప్రజలతో, ముఖ్యంగా మహిళలతో పోలీసులు నడుచుకునే తీరులో మార్పురావాలి. ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడేవారు ప్రజల కడుపు కొడ తారు కానీ పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతోనో, అధికారుల మెప్పు కోసమో కొన్ని సందర్భాలలో ప్రజలను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తున్నారు. అన్ని శాఖలకంటే కూడా పోలీసులంటేనే అసహ్య భావన కలుగుతోంది. మహిళలతో పద్ధతిగా మాట్లాడి.. వారి సమస్యలను ఓపికగా వినాలి. ఈ శిక్షణా తరగతులు పోలీసుల్లో మార్పును తీసుకొస్తాయి.
- కె. జయశ్రీ,
మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్
కొత్త చట్టాలపై అవగాహన
కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఫోక్సా, నిర్భయ చట్టాలపై అవగాహన కల్పించడం వలన మరింత బాధ్యత పెరిగింది.
- శ్రీనివాసులురెడ్డి, కమలాపురం ఎస్‌ఐ
బాధ్యత వహించేలా
పోలీసులు పనిచేయాలి
సమాజంలో ప్రజలకు బాధ్యత వహించేలా పోలీసులు పని చేయాలి. కేసులను నమోదు చేయడం, శాస్త్రీయ దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ లాంటివి నిందితులకు శిక్ష పడేలా ఉండాలి. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ ధ్యేయంగా పోలీసులు పని చేయాలి. ప్రజలే పోలీసులకు యజమానులు. ప్రజలకు పోలీసులు బాధ్యతగా వ్యవహరించినపుడే ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తారు.
- వి.జయచంద్రుడు, జిల్లా పోలీసు
శిక్షణా కేంద్రం, వైస్ ప్రిన్సిపల్, కడప
ఎస్‌ఐలకు శిక్షణ మరింత బాధ్యత
పెంచుతుంది
జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ తాను స్వయంగా ఎస్‌ఐలకు కేసులపై అవగాహన కల్పించాలని శిక్షణ ఇవ్వడం ఎంతో అభినందనీయం.
సాధారణంగా జరిగే తప్పులను సరిదిద్దుకునే సదవకాశం కలుగుతుంది.
- ఎస్‌ఎం అలీ, రాజంపేట అర్బన్ ఎస్‌ఐ
కేసుల దర్యాప్తుల్లో మెలకువలు అవసరం
ప్రస్తుతం కేసుల దర్యాప్తులో మెలకువలు నేర్చుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చిన వారికి కూ డా ఈ శిక్షణ చాలా ఉపయోగం. ముఖ్యంగా ఎస్‌ఐ, రైటర్, అసిస్టెంట్ రైటర్లకు దర్యాప్తులో పాలుపంచుకునే అంశాలపై శిక్షణ ఇవ్వడం ఎంతో అభినందనీయం.
- ఎల్.యోగా,
ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్,కడప.
శాస్త్రీయంగా కేసుల దర్యాప్తు ...
పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నమోదు చేసే కేసులను శాస్త్రీయంగా దర్యాప్తు చేయాలి. సంఘటన జరిగిన ప్రదేశానికి దర్యాప్తు అధికారి, స్టేషన్ రైటర్ తప్పని సరిగా వెళ్లాలి. కేసు నమోదు దగ్గరి నుంచి దర్యాప్తు, అరెస్టు, కోర్టులో కేస్ వరకు అప్రమత్తంగా ఉండాలి.
- సర్కార్, జమ్మలమడుగు డీఎస్పీ
ట్రీట్ భేష్!
Published Thu, Mar 5 2015 1:38 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement