జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల రాజ్యం కొనసాగుతోంది. ఇన్నాళ్లు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల ఆశ చూపిన ఈ మాయగాళ్లు.. ఇప్పుడు రష్యా, సౌత్ ఆఫ్రికా, థాయ్‌లాండ్, లిబియా వంటి దేశాల్లో ఉద్యోగాలు.. డాలర్లలో వేతనాలంటూనిరుద్యోగులకు గాలం వేస్తున్నారు.
సాక్షి, నిజామాబాద్ :
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో గల్ఫ్ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరు బహిరం గంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో నిజామాబాద్ నగరంతోపాటు, ఆర్మూర్, కామారెడ్డి తదితర పట్టణాల్లో గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. ప్రతినెల వేలల్లో జీతాలుంటాయని ఆశపెడుతున్న అక్రమార్కులు వీసాల పేరుతో లక్షలు గుంజుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్, మనీట్రాన్స్‌ఫర్ కేంద్రాల పేరిట తెరిచిన కార్యాలయాల్లో బహిరంగంగానే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇలా వీరు నిబంధనలకు విరుద్ధంగా దందా సాగుతున్నప్పటికీ పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం ఆరోపణలకు తావిస్తోంది.
బహిరంగంగానే..
ఇటీవల జిల్లాకేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోని ట్రావెల్స్ కార్యాల యంలో బహిరంగంగానే ఇంటర్వ్యూలు నిర్వహిం చారు. రూ. 75 వేలు చెల్లిస్తే కువైట్‌లో హెల్పర్ ఉద్యోగం వీసా ఇస్తామని, మెడికల్ టెస్టుల కోసం అదనంగా ఆరున్నర వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నిరుద్యోగులతో బేరం కుదుర్చుకున్నారు. వంద మంది వరకు నిరుద్యోగులు తమ పాస్‌పోర్టులతో ఈ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు కేంద్రానికి వెళ్లి, ఇంటర్వ్యూ నిర్వాహకులను కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రాతపూర్వకంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొంటూ పోలీసులు వారిని వదిలే యడం అనుమానాలకు తావిస్తోంది.
నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన మ్యాన్‌పవర్ సప్లయ్ సంస్థలే ఇలా ఇంటర్వ్యూలు నిర్వహించాలి. ఆయా సంస్థలు ఎక్కడ రిజిస్ట్రేషన్ కలిగి ఉంటే అక్కడే ఇంటర్వ్యూల ప్రక్రియ చేపట్టాలి. కానీ హైదరాబాద్‌కు చెందిన సంస్థ నగరంలోని ఓ ట్రావెల్స్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన వ్యవహారం పొలీసుల దృష్టికి వచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో ఉన్న ట్రావెల్స్‌లోనూ తరచూ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చినప్పటికీ వారు ‘మామూలు’గా వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి.
లక్షల్లో వసూళ్లు
గల్ఫ్ ఏజెంట్లు గ్రామాల్లో సబ్ ఏజెంట్లను నియమించుకుని నిరుద్యోగ యువతకు గాలం వేస్తున్నారు. వీసా కోసం రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. రష్యా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో డాలర్లలో వేతనాలంటూ ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. తీరా ఆయా దేశాలకు వెళ్లాక మోసపోయామని తెలుసుకుంటున్నవారు లబోదిబోమంటున్నారు. ఇలా ఏజెంట్ల చేతిలో మోసపోయి లిబియాకు వెళ్లిన జిల్లా వాసులు పలువురు అక్కడ అనేక ఇబ్బందుల పాలై ఇటీవలే ఉత్త చేతులతో తిరిగి వచ్చారు.
ఫలించని చర్యలు
జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు ఎలాగైనా చెక్‌పెట్టాలని గతంలో పోలీసులు భావించారు. జిల్లాలో గుర్తింపు పొందిన ఏజెంట్లు తమ పేర్లను సంబంధిత పోలీసు స్టేషన్‌లో నమోదు చేసుకోవాలని ఇంతకు ముందు ఎస్పీగా పనిచేసిన విక్రమ్ జిత్ దుగ్గల్ ఆదేశాలు జారీ చేశారు. ఒకరిద్దరు మినహా ఎవరూ స్పందించలేదు. దీనిని బట్టి జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెంట్లు ఒకరో ఇద్దరో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ నగరంతో పాటు పలు పట్టణాల్లో విదేశీ ఉద్యోగాల పేరుతో బహిరంగంగానే ఇంట ర్వ్యూలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయితే కొందరు పోలీసుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారాలన్నీ సాగుతున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల
Published Mon, Nov 18 2013 7:11 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM
Advertisement
Advertisement