జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
Published Wed, Oct 16 2013 6:04 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
కనురెప్ప పడిందో... ఆదమరుపే ఆవహించిందో... అదే అదనుగా మృత్యువు కబళించింది. తీర్థయాత్ర వారి పాలిట విషాదయాత్రగా మారింది. హైవేపై దూసుకుపోతున్న కారు అదుపు తప్పింది... ఆగి ఉన్న లారీని పెద్దశబ్దంతో ఢీకొంది... హాహాకారాలు.. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. దుర్గమ్మ దర్శనానికి బయలుదేరిన విశాఖ జిల్లావాసులు తొమ్మిది మందిలో ఐదుగురిని ఈ ప్రమాదం పొట్టనబెట్టుకుంది. రాజమండ్రిలోని బొమ్మూరు సమీపాన జరిగిన ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
బొమ్మూరు (రాజమండ్రిరూరల్), విశాఖ పట్టణం, న్యూస్‌లైన్ : విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విశాఖ జిల్లా నుంచి కారులో బయలుదేరిన తొమ్మిది మంది రాజమండ్రిలో బొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జాతీయరహదారిపై సుద్దకొండ సమీపంలో ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న టవేరా కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడక్కడే మరణించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం కొత్తకర్ణానివారిపాలేనికి చెందిన గొన్నా శివకుమార్ (28), గద్దే శ్రీనివాసరావు(26), గద్దే వెంకటేష్, వానపల్లి అప్పలరాజు భవానీ దీక్షలో ఉన్నారు. చిననడపర్రు గ్రామానికి చెందిన గురు భవాని పగడాల జోగారావుతో కలసి వారు కనకదుర్గమ్మవారి దర్శనం కోసం విజయవాడ బయలుదేరారు. సింహాచలం శ్రీనివాసనగర్‌కు చెందిన ధమర్‌సింగ్ శంకరరావు (28)కు చెందిన టవేరాకారును వారు బుక్ చేసుకున్నారు.
కారులో ఇంకా ఖాళీ ఉండడంతో కొత్తకర్ణానివారిపాలేనికి చెందిన విరోతి అప్పలశ్రీను (28), అతని భార్య శిరీష, యర్రా రమేష్ (26) కూడా విజయవాడ గుడికి బయలుదేరారు. సోమవారం రాత్రి కొత్తకర్ణానివారి పాలెంలో జరిగిన దుర్గమ్మ ఊరేగింపు అనంతరం అర్ధరాత్రి సమయంలో వారు కారులో విజయవాడకు బయలుదే రారు. మంగళవారం తెల్లవారు జామున 3.35 గంటల సమయంలో రాజమండ్రిలోని బొమ్మూరు మీదుగా వెళుతున్న ఈ కారు జాతీయరహదారిపై సుద్దకొండ వద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుంచి అతివేగంగా ఢీకొట్టింది. లారీ వెనుక చక్రం వరకూ కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ధమర్‌సింగు శంకరరావు, గొన్నా శివకుమార్, గద్దే శ్రీనివాసరావు, విరోతి అప్పలశ్రీను, యర్రా రమేష్ అక్కడిక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన గద్దే వెంకటేష్, విరోతి శిరీష, వానపల్లి అప్పరాజు, పగడాల జోగారావులు ఆర్తనాదాలు చేయడంతో అటుగా వెళుతున్న వారు ఆగి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ట్రాఫిక్ డీఎస్పీ అనిల్‌కుమార్, బొమ్మూరు సీఐ బి.సాయిరమేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన నలుగురినీ 108 అంబులెన్సులో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. లారీ కింద చిక్కుకుపోయిన కారును క్రేన్ సహాయంతో బయటకు లాగారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జయిపోవడంతో మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. క్రేన్ సహాయంతో కారు శకలాలను పెకలించి మృతదే హాలను బయటకు తీయాల్సి వచ్చింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి మాట్లాడుతూ ఆగి ఉన్న లారీని కారు అతివేగంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. తలపైన బలమైన గాయాలు తగలడం వల్లనే ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారన్నారు. డీజిల్ అయిపోవడంతో లారీని రోడ్డుకు పక్కగా ఆపారని ఎస్పీ చెప్పారు.
కారు డ్రైవర్ అలసిపోయి ఉండడంతో కునుకుపట్టి ఈ ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. సంఘటన స్థలాన్ని రాజమండ్రి ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి పరిశీలించారు. ప్రమాదం తీరును ఆయన పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. వీరికి మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని, అవసరమైతే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారన్నారు. వైద్యసేవలను దగ్గరుంచి పర్యవేక్షించాల్సిందిగా రూరల్ తహశీల్దార్ జి.భీమారావును ఆర్డీఓ ఆదేశించారు. కాగా పరిస్థితి విషమంగా ఉన్న గద్దే వెంకటేష్, పగడాల జోగారావులను మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. బొమ్మూరు సీఐ సాయిరమేష్ కేసు నమోదు చేయగా ట్రాఫిక్ సీఐ మురళీకృష్ణారెడ్డి, ప్రకాశంనగర్ సీఐ బీవీ సుబ్బారావు, బొమ్మూరు ఎస్సై షేక్‌జాన్‌మియా, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఆధారం కోల్పోయిన రమేష్ కుటుంబం
ప్రమాదంలో యర్రా రమేష్ దుర్మరణం చెందడంతో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. తండ్రి దేముడు పక్షవాతంతో బాధపడుతుండగా, తల్లి వెంకయ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. రమేష్‌కు పదో తరగతి చదువుతున్న తమ్ముడు నగేష్ ఉన్నాడు. షిప్‌యార్డులో ఓ ప్రైవేటు ఫ్యాబ్రికేషన్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రమేష్ మరణించినట్టు తల్లిదండ్రులకు తెలియపర్చలేదు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో సోదరుడు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికైన ఇంతలోనే..
గొన్నా శివకుమార్ ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులంతా ఆనందంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని మరణ వార్త వారిని కలిచివేసింది. అతని తల్లిదండ్రులు రామారావు, అప్పలనర్సమ్మ గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న రామారావుకు కుమార్తె భాగ్యలక్ష్మితో పాటు శివకుమార్, కనకరాజు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. కనకరాజు బీకాం చదువుతున్నాడు.
వివాహమైన ఐదు నెలలకే..
రెండేళ్ల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన గద్దె శ్రీనివాసరావుకు ఈ ఏడాది మే 30న కశింకోట గ్రామానికి చెందిన నాగమణితో శ్రీనివాసరావుకు వివాహమైంది. ప్రస్తుతం ఫార్మాసిటీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు మరణవార్తతో అతని భార్య నాగమణి రోదనలు అక్కడివారిని కలచివేసింది. అల్లుడు మరణంతో నాగమణి తల్లిదండ్రులు ఉషారత్నం, గోవింద్‌రాజు కుమార్తెను పట్టుకొని గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. ప్రమాదంలో శ్రీనివాసరావు సోదరుడు వెంకటేష్‌కు తీవ్రగాయాలయ్యాయి.
దుఃఖసాగరంలో శ్రీను కుటుంబం
స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న విరోతి అప్పల శ్రీను, శిరీషకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రమాదంలో అతడు దుర్మరణం పాలవ్వగా, శిరీష తీవ్రగాయాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు దేముడు, వరహాలమ్మ అనారోగ్యంతో ఉండడం వల్ల కుమారుని మరణవార్త వారికి చెప్పలేదు. కర్ణవానిపాలేనికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు ప్రమాదాన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు.
అందరికీ దారి చూపి అందని లోకాలకు..
గోపాలపట్నం : దమన్‌సింగ్ శంకర్(28)కు మూడేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇతనికి భార్య నాగేశ్వరమ్మ, ఏడాదిన్నరకొడుకు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను అతనే చూసుకుంటున్నాడు. ఇద్దరు చెల్లెళ్లకీ వివాహాలు జరిపించాడు. అతని మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద వార్త తెలుసుకున్న భార్య నాగేశ్వరమ్మ స్పృహ తప్పి పడిపోయింది.
Advertisement
Advertisement